వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి తెలుగు బోధ‌న త‌ప్ప‌నిస‌రిః సీఎం కేసీఆర్

CM KCR
CM KCR

హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో తెలుగును తప్పనిసరి
చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలుగును తప్పనిసరిగా బోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌
స్పష్టంచేశారు. తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి వరకు
పాఠ్యాంశంగా తెలుగు కచ్చితంగా బోధించే పాఠశాలలు, కళాశాలలకు మాత్రమే అనుమతి ఇస్తామని, ఉర్దూ కోరుకునే
విద్యార్థులకు ఉర్దూ ఐచ్ఛికంగా ఉండాలని సీఎం చెప్పారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో
బోధించాలని, ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు సిలబస్‌ రూపొందించుకుని బోధిస్తే కుదరదని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. దీంతో పాటు అన్ని పాఠశాలల నామ ఫలకాలు కూడా తెలుగులోనే ఉండాలన్నారు. కాగా
హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. ఈ
నేపథ్యంలో మహాసభల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు
రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.