వ‌చ్చే బ‌డ్జెట్ స‌మావేశాల్లో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న మోదీ!

Modi1
Modi

ఢిల్లీః మన దేశంలో అవినీతి నిర్మూలన, సులభతర వాణిజ్యాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక సవరణ చేయ‌నున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దేశంలోని సుమారు 500 ప్రముఖ సంస్థల పన్ను సమీక్ష, దర్యాప్తు ప్రక్రియను సవరించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పన్ను రిటర్న్‌లను పరిశీలించే విషయంలో మానవ ప్రమేయాన్ని తొలగించి, అంతా ఆన్‌లైన్‌ ద్వారానే చేపట్టే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు తెలిపారు. ఇలా ఆన్‌లైన్‌ చేయడం వల్ల ఏ కంపెనీ నుంచైనా సమాచారం కోరినప్పుడు అక్కడ ఉన్న అధికారి విచక్షణతో సంబంధం లేకుండా పన్నుల రిటర్న్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా కచ్చితమైన సమాచారం లభించే అవకాశం ఉంటుందని వివరించారు. ఇటీవల ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సర్వేలో పన్నులు చెల్లింపు అంశంలో 190 దేశాల్లో భారత్‌ 119వ ర్యాంకులో ఉంది. 2014లో ప్రధానిగా ఎన్నికైన మోదీ దేశంలోకి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యమని ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో ప్రస్తుతం 100వ స్థానంలో ఉన్న భారత్‌ను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విస్తరించడం ద్వారా 50వ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమన్నారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్‌ మదింపు విధానాన్ని ప్రత్యక్ష పన్నుల కార్యాలయానికి చెందిన ఐటీ విభాగం పర్యవేక్షణలో చేపట్టనున్నారు. తొలుత దీన్ని ప్రముఖ 500 కంపెనీలకు అనుసంధానిస్తారని, ఈ విధానం విజయవంతమైతే మిగతా పన్ను చెల్లింపు సంస్థలకూ విస్తరిస్తారని వారు తెలిపారు.