వ్యవసాయాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు

YSRCP  IMAGE
YSRCP

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్సీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్సీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమవేశంలో మాట్లాడారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని, ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. సాక్షర భారత్‌ మిషన్‌లో పనిచేసే 20,503 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, వీరికి కేవలం గౌరవ వేతనం మాత్రం ఇస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో వేలాది మంది వచ్చి వినతులు అందిస్తున్నారన్నారు. పది సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకులకు తనఖా పెట్టడానికి ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌కు బదిలీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాజుల కాలంల అనేక సాగునీటి వనరులు ఏర్పాటు చేశారన్నారు. సోమశిల, ఎన్‌ఆర్‌బిసి, వంశధార ఫేస్‌ గోదావరి డెల్టా స్కీం తదితర వాటిని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నారన్నారు. ఇప్పటికే రూ.3500కోట్ల రుణం తీసుకున్నారన్నారు. రుణ అర్హతను మరో రూ.1000కోట్ల పెంచుకునేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల మీతో భాగస్వామ్యం పంచుకున్న బిజెపి ఆరోపిస్తుందన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేటు సంస్థలకు తాకట్టు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే భారీగా ప్రాజెక్టుల అంచనాల పెంచి వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు. రూ.1700కోట్ల ఖర్చు పెడితే ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. కానీ రూ.52వేల కోట్ల ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. అనుచరులకు ప్రాజెక్టులు కట్టబెట్టారే తప్ప వాటిని పూర్తి చేయడం లేదన్నారు. విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రౌండ్‌ను చైనాకు తాకట్టుపెట్టారని, అమరావతిని సింగపూర్‌కు తాకట్టుపెట్టారని, రానున్న రోజుల్లో అనేక విద్యాసంస్థలను, పరిశోధనల సంస్థలను ప్రైవేటు సంస్థలకు తాకట్టుపెట్టేందుకు చంద్రబాబు సిద్దపడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ప్రైవేటు సంస్థలకు తాకట్టుపెడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను వంచించారని, ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవలన్నారు. ఇటీవల పోలవరం కాపర్‌ డ్యాంను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, ఇది సిగ్గుచేటు అన్నారు. పునాదులకు నీరు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు కాపర్‌ డ్యాంను నిర్మిస్తారని, అలాంటి కార్యక్రమాన్ని జాతికి అంకితం చేస్తారా అంటూ ప్రశ్నించారు. తొమ్మిది సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నాలుగు సంవత్సరాలలో వ్యవసాయానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తక్షణం ఏపి రైతాంగాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టే కార్యక్రమాలు వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని అనే అహంబావం మంచిది కాదన్నారు.