వైద్య,ఆరోగ్య శాఖ పోస్టుల భర్తీలో అవకతవకలు

fraud
fraud

హైదరాబాద్‌: వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ అక్రమాల మయంగా తయారైంది. నియామకాలను పారదర్శకంగా నిర్వహించాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారులు కొందరి వద్ద పోస్టులు ఇప్పిస్తామంటూ రూ. లక్షల మేర వసూలు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1133 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో వైద్యుల కొరతను తీర్చే లక్ష్యంతో వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 919 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లు నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. వివిధ విభాగాల వారీగా 15 రకాల స్పెషలిటీ విభాగాలకు నియామకాలు జరిగాయి. వీటిలో ఆర్థోపెడిక్‌-47, రేడియాలజీ-50, డెర్మటాలజీ-20, ఫోరెన్సిక్‌-28, జనరల్‌ మెడిసిన్‌-68, హాస్పిటల్‌ అడ్మిన్‌-09, పల్మనరీ-39, ఆప్తమాలజీ-34, సైకియాట్రిస్ట్‌-22, ఎనస్తీషియా-156, ఈఎన్‌టీ-17, పాథాలజీ-55, జనరల్‌ సర్జన్స్‌-78, ఓబిజి-146, పెడియాట్రిక్స్‌-150 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల నియామకాలకు సంబంధించి పారదర్శకత పాటించాలనీ, ఎలాంటి అక్రమాలకు చోటివ్వరాదని సాక్షాత్తు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బేఖాతరు చేశారు. ఈ అంశంపై రెండు సార్లు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు సైతం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పోస్టింగులు ఓ పద్దతి ప్రకారం ఇవ్వాలని సూచించారు. అలాగే, ఇప్పటికే వివిధ స్థాయిలలో ఉన్న నియామక ప్రక్రియను సైతం వేగవంతం చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ డీహెచ్‌, వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌, వైద్యుల నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత, అనుభవాన్ని పోస్టుల భర్తీ ప్రక్రియలో పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉండగా, కొంత మంది వద్ద భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసి అక్రమాలకు తెరతీసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్థోపెడిక్‌, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పల్మనరీ పోస్టులకు సంబంధించి ఒక్కో వైద్యుని నుంచి రూ. 20 లక్షల దాకా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారుల అవినీతి వ్యవహారంపై బాధితులు కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పోస్టింగులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి ఆ తరువాత అవినీతి జరిగిన విషయం బయటికి పొక్కడంతో వారికి పోస్టింగులు ఇవ్వలేక, తిరిగి వారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం.