వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌

raghuma reddy, cmd
raghuma reddy, cmd

24 గంటల విద్యుత్‌ ఏడాదైన సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన సిఎండి
హైదరాబాద్‌: రానున్న వేసవి కాలంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తామని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌ సిఎండి గౌరవరం రఘుమారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా విషయంలో ఏడాది కాలం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో బుధవారం సిఎండి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా రఘుమారెడ్డి మాట్లాడుతూ 24 గంటల విద్యుత్‌ సరఫరాతో అన్ని రంగాలకు నిరంతర విద్యుత్‌ను అందించి తెలంగాణ రాష్ట్రం అనేక రికార్డులను సృష్టించిందన్నారు. ఈ విజయానికి గుర్తుగానే కేక్‌ కట్‌ చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 సెప్టెంబర్‌ 11వ తేదీన రాష్ట్రంలో 10818 మెగా వాట్ల గరిష్ట డిమాండ్‌, సంస్థ పరిధిలో అక్టోబర్‌ 9వ తేదీకి 6961 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ని ఎదుర్కొన్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్‌ 9వ తేదీన 233.44 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశామని చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో గత వేసవిలో గరిష్టంగా 2958 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేసినట్లు ఆయన వెల్లడించారు. మే 29వ తేదీన ఒక్క రోజున 62.83 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశామన్నారు. అనంతరం సంస్థ సీజీఎం, ఎస్‌ఈలతో సిఎండీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ సాగునీటి పారుదల ప్రాజెక్టుల కారణంగా నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయ రంగం నుండి అధిక విద్యుత్‌ డిమాండ్‌ కలిగే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌ స్టేషన్ల నిర్వహిణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను రఘుమారెడ్డి ఆదేశించారు. ఆయా కార్యక్రమాలకు ముందు నూతన సంవత్సరం సందర్భంగా సంస్థ డైరక్టర్లు టి శ్రీనివాస్‌, జె శ్రీనివాసరెడ్డి, జి పర్వతం, ఎస్‌ స్వామిరెడ్డి, పి నరసింహరావు తదితరులు సిఎండికి శుభాకాంక్షలు తెలిపారు.