వేపలో వెలకట్టలేని గుణాలు

NEEM
భారతదేశంలో వేప చెట్టు లేని ప్రదేశం కనిపించదు. పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ఈ చెట్టు దర్శనమిస్తుంది. గ్రామీణులు వేపను లక్ష్మీ రూపంగా భావిస్తారు. వేప సర్వవిధమైన భద్రతలను కలిగిస్తుంది కనుక దీనిని వర్ధతోభద్ర అంటారు. వేప ఉన్న ప్రాంతంలో గాలి ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. వేపలోని ఔషధ గుణాలు వెలకట్టలేనివి. వేపలోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంది. ఔషధపరంగా వేపచెట్టులోని చిగురాకులు, ముదురు ఆకులు, పూవులు, కాయలు, గింజలు, వేళ్లు, చెట్టు బెరడు ఉపకరిస్తాయి. చివరకు వేప జిగురు కూడా ఉపయుక్తమే. వేప ఆకులు, పసుపు, శనగపిండి సమంగా తీసుకుని పాలు కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకుంటే మొటిమలు, వాటి వలన ఏర్పడిన మచ్చలు తగ్గి ముఖం కాంతివంతమవుతుంది. వేప ఆకులనుదంచి, స్వరసాన్ని తీసుకుని కొబ్బరినూనెలో కలిపి మరగబెట్టాలి. దీనిని రాసుకుంటే దురదలు తగ్గుతాయి.వేప చిగుళ్లతో పసుపుకలిపి మెత్తగా నూరి రాసుకుంటేశరీరంపై వచ్చేదద్దుర్లు తగ్గుతాయి. వేప చెట్టు సర్వాంగాలను గ్రహించి, చూర్ణం చేసి తగు మోతాదులో సేవిస్తే కుష్టు వ్యాధి తగ్గుతుంది.వేప ఆకులకు పసుపు చూర్ణం కలిపి మెత్తగా నూరి క్రమం తప్పకుండా లేపనం వేసుకుంటూ ఉంటే బోదకాలు వ్యాధి తగ్గుతుంది. వేప ఆకుల రసంలో తేనెనుచేర్చి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తే కామల (కామెర్లు) వ్యాధి తగ్గుతుంది.

వేప ఆకులతో కషాయం కాచి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. వేప ఆకులనుంచి రసం తీసి, దానిలో తగినంత తేనె కలిపి సేవిస్తే కడుపులోని క్రిములు నశిస్తాయి.

వేప చిగుళ్లు, పటిక బెల్లం, మిరియాలు సమంగా తీసుకుని నూరి, నీటితో కలిపి సేవిస్తే అతిదాహం తగ్గుతుంది. వేప పుల్లతో పళ్లు తోముకుంటూ ఉంటే దుర్వాసన తగ్గుతుంది. రుచి పెరుగుతుంది. పళ్లు గట్టిపడతాయి.