వెనక్కి తగ్గిన జెట్ ఎయిర్వేస్

న్యూఢిల్లీ: ఉద్యోగులు జీతాలు తగ్గించుకోవాలని, లేకుంటే జెట్‌ఎయిర్‌వేస్ గాలిలోకి ఎగరదని హెచ్చరికలు జారీ చేసిన జెట్ మేనేజ్మెంట్ ఇప్పుడు దిగొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము జీతాలు తగ్గించుకోమని ఉద్యోగులు, పైలెట్లు వాదించడంతో ఎట్టకేలకు జెట్‌ఎయిర్‌వేస్ వెనక్కి తగ్గింది. నాన్ మేనేజ్మెంట్ స్టాఫ్‌కు 25 శాతం తగ్గించబోతున్న వేతన ప్రతిపాదనను పక్కనపెట్టింది. శుక్రవారం జెట్‌ఎయిర్‌వేస్ ఉద్యోగులు, చైర్మన్ నరేష్గోయల్తో సమావేశం కావడంతో ఈ సమస్యలకు పరిష్కారం దొరికింది. ఈ సమావేశమైన తర్వాత జులై నెల జీతాలు కూడా ఈ విమానయాన సంస్థ శుక్రవారమే ఉద్యోగుల అకౌంట్లోకి క్రెడిట్ చేసింది. జీతాల కోత చర్చనేపథ్యంలో జెట్ మేనేజ్మెంట్ జులై నెల జీతాలు ఆపివేసిన సంగతి తెలిసిందే. వేతనాల కోతపై ప్రతి ఒక్కర్ని ఒప్పించిన తర్వాత జులై నెల జీతాలు ఇవ్వాలనుకుంది. కానీ ఎలాంటి వేతన కోఒత చేపట్టడం లేదని చైర్మన్ భరోసా ఇవ్వడంతో, వెంటనే తమ వేతనాలను తమ అకౌంట్లోకి క్రెడిట్ చేసినట్లు ఓ జెట్‌ఎయిర్‌వేస్ ఉద్యోగి వెల్లడించారు. అయితే జెట్ ఎయిర్వేస్ టాప్ మేనేజ్మెంట్ ఇప్పటికే వేతనాలను తగ్గించుకుంది. వేతన కోతపై మీడియాలో పలు రిపోర్టులు రావడంతో, గోయల్ ఈ విమానాయాన సంస్థ ఇమేజ్ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్ అధికారులు చెప్పారు. దేశీయ ఏవియేషన్ మార్కెట్ ఆఫర్లను అందుకొని ఈ ఎయిర్‌లైన్ ముందంజలో ఉంటుందని గోయల్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ కష్టకాలంలో ఉండటంతో తమకు సాయం చేయాల్సిందిగా జెట్ స్టాఫ్‌ను గోయల్ కోరినట్లు వెల్లడైంది. గోయల్ అభ్యర్థన మేరకు ఎయిర్‌లైన్‌కు మద్దతు ఇవ్వాలని జెట్ పైలెట్ల అసోసియేషన్ కూడా తమ సభ్యులను కోరింది. ముడిచమురు ధరలు విఫరీతంగా పెరగిపోవడం, రూపాయి మారకం విలువ క్షీణించడంతో, జెట్‌ఎయిర్‌వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు 5శాతం నుంచి 25 శాతం వరకు తగ్గించుకోవాలని మేనేజ్మెంట్ కోరింది. వేతన కోతపై జెట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పైలెట్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వరుసగా రెండేళ్లు 2016-17లాభా తర్వాత తొలిసారి జెట్ 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.767 కోట్ల నష్టాలను నమోదు చేసింది. కేవలం జెట్ ఎయిర్వేస్ మాత్రమే కాకుండా, ఇండిగో కూడా భారీగా నష్టాలను చవిచూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండిగో కూడా నికరలాభాలు 97 శాతం క్షీణించాయి.