వెండి తెరపై రాని కొత్త కథ ‘ఇఈ’

ram ganapati rao
ram ganapati rao

-దర్శకుడు రామ్‌ గణపతిరావు
థ్రిల్లర్‌ అంశాలను వినోదాన్ని మేళవించి ప్రేక్షకులను అలరించే రీతిలో ఇఈ చిత్రాన్ని మలచటం జరిగిందనిదర్శకుడు రామ్‌ గణపతిరావు వెల్లడించారు. నీరజ్‌శ్యామ్‌, నైరాషా జంటగా నవబాల క్రియేషన్స్‌ పతాకంపై లక్ష్మణ్‌రావు నిర్మించిన ఈచిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో రామ్‌గణపతిరావు కొద్దిసేపు మాట్లాడారు. ఆయన మాటల్లోనే…
వ్యక్తిగత నేపథ్యం

నా స్వస్థలం అత్తిలి. అక్కడే విద్యాభ్యాసం. ఆ తర్వాత యానిమేషన్‌ కోర్సు నేర్చుకోవటానికి హైదరాబాద్‌ వచ్చా. ఆ సమయంలో దర్శకుడు మారుతితోపరిచయం ఏర్పడింది. యానిమేషన్‌ రంగంలో చాలా ఏళ్లుపనిచేశా. యానిమేటర్‌గా దాదాపు 400 ఎపిసోడ్స్‌ చేశా. పొపెల్స్‌పేరుతో ఓ యానిమేటెడ్‌ సిరీస్‌ రూపొందించా. అయితే సినీ దర్శకుడిగా నా తొలి చిత్రమిదే.

భిన్న మనస్తత్వాల జంట కథ
స్త్రీ ద్వేషి అయిన ఓ యువకుడికి, అబ్బాయిలంటే అసహ్యించుకునే ఓ అమ్మాయికి మధ్య జరిగేకథ ఇది. అంటేభిన్న మనస్థత్వాలతో ఇందులోని జంట కథ సాగుతుంది. ఈ నేపథ్యం వెనుక అసలుకారణం గురించి చెప్పాలంటే. బ్రహ్మదేవుడి లీలలతో వారి ఆత్మలు తారుమారవుతాయి. ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మల వల్ల వారిద్దరి జీవితాల్లో ఎలాంటి గందరగోళం నెలకొంటుంది. ఆ తర్వాత దాని నుంచి వారెలా బయటపడతారన్న ఇతివృత్తాంతంతోఈచిత్రాన్ని మలిచాం. అశ్లీలతకు తావులేకుండా క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమాను రూపొందించాం. అంతర్లీనంగా తల్లి గొప్పతనాన్ని చాటేచక్కటి సందేశాన్ని కూడ ఇందులో మిళితం చేశాం. తెలుగు వెండితెరపై ఇలాంటి కథ రాలేదు. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పగలను. కొత్త కథనుచూడాలని కోరుకునేప్రేక్షకుల్ని తప్పకుండా ఆహ్లాదపరుస్తుంది.

పెద్ద సినిమాగానే భావించాం
దీన్నిచిన్న సినిమాగా కాకుండా మేం పెద్దసినిమాగానే భావించాం. భావిస్తున్నాం. వాస్తవానికి నాకు దర్శకత్వ అనుభవం లేదు. ఎవరి దగ్గరా పనిచేయలేదు. కానీ కథను నమ్మాం. విజువల్స్‌ చూస్తే చిన్న సినిమా అన్పించలేదు. మేం ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన తర్వాత అంతమంది చూడటమనేది మా మొదటి సక్సెస్‌. దయచేసి సినిమాను చూడండి మిమ్మల్ని ఎక్కడా నిరుత్సాహపరచడదు. మదర్‌ సెంటిమెంట్‌ ఎమోషన్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటాయి. తప్పకుండా కంటతడి పెెట్టుకుంటారా. సీనియర్‌ నటుడు సుధాకర్‌ చాలా మంచిపాత్ర చేశారు. తప్పకుండా ఈచిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది.ఎఆర్‌ రెహమాన్‌ శిష్యుడు కృష్ణచేతన్‌ అందించిన బాణీలకు మంచి స్పందన లభిస్తోంది.

ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలన్నది నా కల
మెగాస్టార్‌ చిరంజీవిగారు నా అభిమాన నటుడు. యానిమేటర్‌గా పనిచేస్తున్న రోజుల్నించి బన్నీ (అల్లు అర్జున్‌)తో పరిచయం ఉంది. ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలన్నది నా కల. అలాగే ఎన్టీఆర్‌ నటనను ఇష్టపడతాను.