వెండితెర అరుణకిరణం టి.కష్ణ పుస్తకావిష్కరణ!

T.KRISHANA
T.KRISHANA book release

వెండితెర అరుణకిరణం టి.కష్ణ పుస్తకావిష్కరణ!

 

అభ్యుదయ చిత్రాల దర్శకుడు టి.కష్ణ పై సీనియర్‌ అండ్‌ సిన్సియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు రచించిన వెండితెర అరుణకిరణం టి.కష్ణ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు పుస్తకాన్ని ఆవిష్కరించి..తొలి ప్రతిని టి.కష్ణ తనయుడు, కథానాయకుడు గోపిచంద్‌ కు అందజేశారు. సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావాహిని ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. దర్శకరత్న దాసరి నారయణరావు మాట్లాడుతూ.. పసుపులేటి రామారావు టి.కష్ణ పై పుస్తకం రాస్తున్నా అని చెప్పగానే చాలా సంతోషించా. 45 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పటికే అలాగే ఉన్నాడు రామారావు. తను లాభాలు ఆశించి పుస్తకాలు రాసే వ్యక్తి కాదు. టి.కష్ణలాగే గొప్ప లెఫ్ట్‌ భావాలు ఉన్నవాడు. సినిమా చరిత్రను జనాల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో పుస్తకాలు రాస్తుంటాడు.
ఈ పుస్తకం కూడా అందులో భాగమే. చాలా మంది ప్రాచుర్యం పొందిన కొంత మంది దర్శక నిర్మాతలు, హీరోల పేర్లే ప్రస్తావిస్తుంటారు తప్ప…మధ్యలో వారిని వదిలేస్తుంటారు. కానీ, ఎవరి పంథాలో వారు గొప్పవారే. మా జనరేషన్‌ లో కొత్త భావాలు, కొత్త తరం దర్శకుడుగా టి.కష్ణ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. వాస్తవాలను తెరకెక్కించాలంటే ఆ దర్శకుడిలో నిజాయితీ ఉండాలి. అప్పుడే ఆ సినిమాను రక్తి కట్టించగలడు. అలాంటి నిజాయితీ ఉన్న దర్శకుడు కాబట్టే ఆరు అద్భుతమైన చిత్రాలు చేశారు టి. కష్ణ. తెలుగు సినిమా చరిత్ర రాయాల్సి వస్తే అందులో రెండు పేజీలు అట్టి పెట్టాల్సిన దర్శకుడు టి.కష్ణ. ప్రజలు ఆయనపై ఎంతో అభిమానాన్ని కురిపించారు.అలాంటి గొప్ప వ్యక్తుల చరిత్ర జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, ఘంటసాలను సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది కష్ణవేణి గారు. కానీ, ఎంత మందికి ఈ నిజాలు తెలుసు. నేను గత మూడున్నర ఏళ్లుగా సినీ చరిత్ర గురించి ఒక పుస్తకం రాస్తున్నా.. ఇంకా ఏడాదిన్నర పట్టే అవకాశం ఉంది. దాని ద్వారా ఎన్నో నిజాలు తెలిసే అవకాశం ఉంది అన్నారు. పసుపులేటి రామారావు మాట్లాడుతూ.. టి.కష్ణ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధమే ఈ పుస్తకం రాయడానికి కారణమైంది. నా గుండె పొరలలోంచి వచ్చిన పుస్తకమే ఈ వెండితెర అరుణకిరణం టి.కష్ణ. ఈ పుస్తకం తేవడానికి పోకూరి బాబూరావు, నాగేశ్వరరావు ఎంతో మెటీరియల్‌ తో పాటు పోత్సాహం అందించారు అన్నారు.