‘వృద్ధి’పై కాకిలెక్కలు!

పరుగులో వెనుకబడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు
బేస్‌ సంవత్సరం మారినా పరిగణనలోకి తీసుకోని ఎపి సర్కార్‌
తెలంగాణలోనూ వృద్ధి రేటు అంతంత మాత్రమే
ప్రాధాన్యతా రంగంలో తీవ్ర లోటు
కలిసిరాని ఉత్పాదక రంగం
సర్వీసు రంగంలోనూ పెరగని ప్రగతి
హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి. కరువు పరిస్థితులవల్ల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు. విభజన తర్వాత ఈఏడాదిన్నర కాలంలో పారిశ్రామిక రంగం ఇంకా పుంజుకోలేదు. దీంతో వాస్తవ వృద్ధి రేటు అంతంత మాత్రంగా ఉన్నా తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా నేల విడిచి సాము చేస్తున్నట్లుగా గణాంకాలతో తిమ్మిని బమ్మి చేస్తు న్నాయి. తెలంగాణ లెక్కలు కూడా మెరుగ్గా లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్‌ మరోఅడుగు ముందుకువేసి పూర్తిగా అంకెలగారడి చేస్తున్నది. ఎపి సర్కార్‌ తన రాష్ట్రంలో మత్స్య సంపద గత ఏడాది కంటే 170 శాతం పెరుగుదల సాధించిందని, పశు సంవర్థక శాఖ ద్వారా 40 శాతం వృద్ధి రేటు వచ్చిందని పేర్కొనడం విమర్శలకు తావిస్తున్నది. కరువు, వరదల వల్ల ఆయా జిల్లాల్లో ప్రాధాన్యత రంగమైన వ్యవసాయంలో దిగుబడి తగ్గి తీవ్ర పరిస్థితులు ఉన్నా, మొత్తంగా ప్రాధాన్యత రంగంలో గణనీయమైన ప్రగతిని రికార్డు చేసి లేని వృద్ధి రేటును అంకెల గారడితో పెంచి చూపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో ఎపి 12 శాతం వృద్ధి రేటు సాధించినట్లుగా ఇటీవల ఎపి సర్కార్‌ ప్రకటించుకోవడంతో ఆర్థిక వేత్తలు ఈ అంశంపైతమ దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వ లెక్కల సాధ్యాసాధ్యాలపై విశ్లేషణలను చేస్తున్నారు. ఈస్థాయిలో వృద్ధిరేటు వాస్తవంగాఉంటే ప్రజల ఆదాయం కూడా ఇదే స్థితిలో ఉండాలని వారి కొనుగోలు శక్తి పెరగాలని, పైగా వారి జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు కనిపించాలనేది ఆర్థిక వేత్తల అభిప్రాయంగా ఉంది. అయితే జిఎస్‌డిపి ప్రధానంగా మూడు రంగాల్లో లభించిన అభివృద్ధి ఆదారంగా లెక్కిస్తారు. వ్యవసాయ రంగం, ఉత్పత్తిరంగం, సేవా రంగంలో మొత్తంగా ఆదాయం పెరుగుదల ఆధారంగా రాష్ట్ర స్తూల ఉత్పత్తిని లెక్కిస్తారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూడు రంగాలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన స్థాయిలో ప్రగతిని సాధించలేకపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ఈ ఏడాది దాదాపుగా దెబ్బతింది. తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల రైతాంగం విలవిలలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రకృతి వైపరీత్యాలు రైతాంగాన్ని దెబ్బతీయడంతో అధిక ఆర్థిక సహాయం కోసం కేంద్రాన్ని కోరుతున్నారు. ఎపిలో పది జిల్లాల్లోని 359 మండలాలను కరువు తాకిడి ప్రాంతాలుగా ప్రకటించిన ఎపి సర్కార్‌ ఈ మేరకు కేంద్రం నుంచి తగిన సహాయం కోసం అభ్యర్థించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 403 కోట్లు మంజూరయ్యాయి.

కాగా తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు -వరదల వల్ల నాలుగు జిల్లాల్లో తీవ్ర నష్టంజరిగింది. రైతులు తమతమ పంటలను నష్టపోయారు. ఇక తెలంగాణలో 231 కరువు మండలాల్లో ఆర్థిక సహాయక చర్యల కోసం సుమారు 2,300 కోట్ల నిధులు కావాలని కోరగా, 791 కోట్ల రూపా యలను ఇటీవలే కేంద్రం మంజూరు చేసింది. అయినప్పటికీ ఈ రెండు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాలు ప్రగతిపథంలో ముందుకు పోతు న్నాయని, గ్రోత్‌ రేటు గణనీయంగా ఉందని చెప్పడంలోని ఔచిత్యం ప్రశ్నార్థకమవుతున్నది. జిఎస్‌డిపిలో సింహ భాగం వ్యవసాయ రంగం పైనే ఆధారపడి లెక్కలు రూపొందిస్తారు. ఈ మేరకు వ్యవసాయరంగం తీవ్రంగా నష్టపోయి నప్పటికీ ఎపి సర్కార్‌ సరికొత్త గణాంకాలను రూపొందిచింది. మత్స్య సంపద గతంలో ఎన్నడూ లేని విధంగా 170 శాతం వృద్ధిని చూపడం విమర్శలకు తావిస్తున్నది. ఇక వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయినందని ఒకవైపు కరువు తాండవిస్తున్నదని కేంద్ర సహాయం కోరిన సర్కారే, మరో పక్క ఒక్కో వ్యవసాయ కరెంట్‌ పంపు సెట్టు కింద పెద్దయెత్తున దిగుబడి వచ్చిం దని లెక్కలు వేయడం ఆ రాష్ట్ర ప్రత్యేకతగా చెప్పు కోవాలి. 2011 ను బేస్‌ ఇయర్‌గా తీసుకొని జిఎస్‌డిపిని లెక్కించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను రూపొందించగా దీన్ని కూడా ప్రభుత్వం పాటించలేదు. ఈ ఆధార సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే గ్రోత్‌ రేటు నెగటివ్‌కు మారుతుందని సీనియర్‌ అధికారి ఒకరు వివరించారు.

డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ చూపి పరిశ్రమలను ఆకర్షించాలని…
కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్ర సర్వతో ముఖాబివృద్దికి పరిశ్రమల స్థాపన ఎంతో కీలకమని, ఈ మేరకు ఔత్సాహికులను ఆకర్షించేందుకు ఎపి సర్కార్‌ డబుల్‌ డిజిట్‌ వృద్ధి రేటును అధికంగా ప్రచారం చేస్తున్నది. జాతీయ సగటు ఎలా ఉన్నప్పటికీ ఎపిలో అధిక వృద్ధి రేటు సాధిస్తు న్నట్లుగా చెప్పుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. కొత్త రాజధాని నిర్మాణం విషయం లోనూ ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆర్షించేలా చర్యలు తీసుకుంది. దేశ, విదేశీ పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నది. అంతర్జాతీయ సంస్థలను కూడా ఈ నిర్మాణంలో భాగస్వామ్యం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్శించేందుకు విదేశీ పర్యటలను పెంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ టిడిపి భాగస్వామి కావడంతో ఈ పలుకుబడిని వినియోగించుకుంటున్నారు.
ఈ మేరకు కొత్త రాష్ట్రం అయినప్పటికీ అధిక అభివృద్ధి ఉందని చెబితేనే పెట్టుబడులు పెరుగు తాయి. ఆ లక్ష్యంతోనే అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తూ ఆర్థిక వేత్తలు ముక్కుపై వేలు వేసుకునేలా గణాంకాలను ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పారిశ్రామికి ప్రగతి అధికంగా సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఆ సర్కార్‌, తన జిఎస్‌డిపి వృద్ధి రేటును పెంచేందుకు ఈ గణాంకాలను తన ప్రణాళిక శాఖ ద్వారా తయారు చేయించిందనే ఆరోపణలు వస్తు న్నాయి. వ్యవసాయ రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఒడిదొడుకులక లోనుకాగా పారిశ్రామిక రంగం కూడా ఇంకా నిలదొక్కుకునే స్థితిక రాలేదు. ఇటీవలే ఎపి సర్కార్‌ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహించగా దాదాపు అయిదు లక్షల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగినట్లుగా ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ మేరకు ఎంఒయులు కుదుర్చుకున్న పారిశ్రామిక సంస్థలన్నీ ఎపి పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉత్పతి రంగాన్ని పెంపొందిస్తే, అప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పతి (జిఎస్‌డిపి) ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. దీంతో గ్రోత్‌ రేటు కూడా 12 కాదు 15 శాతం సాధించామని పాలనా యంత్రాంగం చెబితే అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఏడాదిన్నర కాలంలో కొత్తగాపరిశ్రమల స్థాపన ఈ స్థాయిలో జరగలేదు.

ఎంఒయులన్నీ వాస్తవ రూపం దాల్చడానికి కూడా మరో రెండు మూడేళ్లు పడుతుంది. కానీ ఎపి సర్కార్‌ ఊహాలోకంలో విహరిస్తున్నట్లుగా వృద్ధి రేటును పేర్కొనడం పట్ల ఆర్థిక వేత్తలు ఆశ్చర్య పోతున్నారు. పైగాడబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ను సస్టేన్‌(నిలుపుకోవడం) చేసుకోవడం కష్టతరమని కూడా వారంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువ వృద్ధి రేటు ఉంటేనేతర్వాతి సంవత్సరంలో అది అత్యధికంగా కనిపిస్తుందని వారు వివరిస్తున్నారు.

సేవా రంగం అంతంతే
సేవా రంగం ద్వారా కూడా జిఎస్‌డిపికి అధిక ఆదాయం సమకూరే పరిస్థితులు కూడా ఎపిలో కనిపించవు. ఐటి ఈ ప్రాంతంలో ఇంకా విస్త రించాల్సి ఉంది. దేశ,విదేశీ ఐటి రంగ నిపుణు లను ఆహ్వానించి ఎపిని సేవా రంగంలో అభివృద్ధి చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించాలని సర్కార్‌ ప్రణాళికా రచన సాగిస్తున్నది. పార్టనర్‌షిప్పు సదస్సులో ఈ విషయంలోనూ ఒప్పందాలు జరిగాయి. అయితే తెలంగాణలో ఐటి రంగంలో ఇప్పటికే కొంత అభివృద్ధి జరిగింది.
మరిన్ని పరిశమ్రలు రాబోతున్నాయి. కానీ ఈ ఏడాదిన్నరలో తెలంగాణకు కూడా భారీగా పెట్టుబడులు రాకపోవడంతో పారిశ్రామిక ప్రగతి అతంతమాత్రంగానే ఉంది. జిఎస్‌డిపి మరింత పెంచి చూపడం ద్వారా అధిక రుణం తీసుకు నేందుకు తెలంగాణ సర్కార్‌ ప్రయత్నిస్తున్నది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం కింద రుణ పరిమితిని మూడు శాతం నుంచి మూడున్నర శాతానికి పెంచు కునేందుకు తెలంగాణ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ధనిక రాష్ట్రంగా తెలంగాణను చూపడానికి చేసిన ప్రయత్నాలు ఈ రాష్ట్రానికి రెండు విధాలుగా నష్టాన్ని తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు. వ్యవసాయ రంగం తెలంగాణలో తీవ్ర ఒడిదుడుకు లకులోనైంది. పైగా తీవ్ర కరువు పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లొ దిగుబడి బాగా తగ్గిపోయింది. రబీలో సాగునీటికి కటకట ఏర్పడి 25 శాతం లోపుగానే రైతులు సేద్యం చేస్తున్నారు. కొత్త విధానం ప్రకటించినా, పారిశ్రామికంగా ఇంకా పెట్టుబడులు పెరగాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతగా ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి జరిగిందని గ్రోత్‌ రేటు బాగా పెరిగిందని లెక్కలు చెప్పడం విమర్శలకు తావిస్తున్నది.