వీగిపోతున్న కేసులకు కారణం ఏమిటో!

                           వీగిపోతున్న కేసులకు కారణం ఏమిటో!

court
court

లోపం ఎక్కడుందనే చర్చ
హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్‌ పలు నిర్ణయాలు న్యాయస్థానాల్లో నిలవకపోవడంపై రాష్ట్రంలో ప్రత్యేక చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ పరంగా ఏ కీలక నిర్ణయం జరిగినప్పటికీ దానిని పలు స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలించే యంత్రాంగం ఉంటుంది. ఈ మేరకు తెలంగాణలోనూ ఉన్నతాధికారులతోపాటు న్యాయ మంత్రిత్వశాఖ ఈ విషయాలన్నింటిని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడ, ఎందుకు ఈ లోటుపాట్లు జరుగుతున్నాయో కానీ తెలంగాణ సర్కార్‌ తీసుకున్న అనేక నిర్ణయాలు కోర్టు తీర్పుల వల్ల సకాలంలో అమలుకు నోచుకోలేకపోవడం జరుగుతున్నది. ప్రభుత్వ పరంగా ఉన్న అధికార వ్యవస్థ తమ బాధ్యతగా ముఖ్యమంత్రికి లేదా మంత్రివర్గానికి తగిన సలహాలు ఇవ్వాలి. చట్టం ఏమి చెబుతున్నది? నిబంధనలు ఏమిటి? ఎవరైనా న్యాయస్థానాలకు వెలితే పరిస్థితి ఏమిటి? అంతా రూల్స్‌ ప్రకారం జరుగుతున్నాయా? అనేది సంబంధింత అధికారులతోపాటు ఉన్నతాధికారుల వ్యవస్థ మంత్రిమండలికి లేదా విడిగా మంత్రులకు సలహాలు, సూచనలు అందించాల్సిందే. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతున్నదో లేదా ప్రభుత్వ పరంగా కోర్టులో వాదోపవాదాలు చేయడంలో ప్రభుత్వ పరంగా సమాచారం సరిగా అందకపోవడమే లేక వాదనా పటిమ లేకనో అనేక కేసులు వీగిపోతున్నాయి. ఇందుకు అనేక కేసులు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
న్యాయస్థానాలు రాజ్యాంగానికి, చట్టాలకు భాష్యం చెబుతాయి. అంటే రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నవి లేదా నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ, కోర్టుల్లో వాదనా పటిమ కూడా కీలకమని భావిస్తారు. పైగా ఎక్కువ నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోతున్న సమయంలో పాలనా యంత్రాంగం ఎక్కడ లోపం జరుగుతున్నదో విశ్లేషించుకొని, సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు కూడా ముందుకు వస్తున్నాయి. రాజకీయంగా సమర్థించుకునే ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో తగిన కసరత్తు, కార్యాచరణ లోపాలును సరిదిద్దు కోవాల్సి ఉంటుంది. అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్న ప్రకాశ్‌ రెడ్డి రాజీనామా తర్వాత ఇప్పటివరకు ఈ పోస్టును ప్రభుత్వం భర్తీచేయలేదు. ?ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న పలు నిర్ణయాలు కోర్టుల్లో పరిశీలనకు వచ్చి, ప్రభుత్వం ఇబ్బంది పడిన సందర్భాలు కింద ప్రస్తావించిన కేసుల్లో వెల్లడైంది. తెలంగాణలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాంస్కృతిక సారథుల నియామక అంశంపై హైకోర్టు ఆక్షేపణలు చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ నియామకాలకు సంబంధించి కనీస నియమ నిబంధనలను పాటించలేదనే కోర్టు ఆక్షేపణకు పాలనా యంత్రాంగం ముఖ్యంగా అధికారులు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్‌ శాసనసభ్యులను బహిష్కరించిన కేసులో విచారణ జరుగుతున్నది. ఈ కేసులోని అంశాలు ప్రభుత్వానికి సంబంధం లేదని, అసెంబ్లీ పరిధిలోని కేసుగా అధికారులు చెబుతన్నా, ఇందులోనూ న్యాయ శాఖ పరంగా తగిన కసరత్తు జరగలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఏపి హైసింగ్‌ సొసైటీ భూములు:
ఎపీఎన్జీవోలకు కేటాయించిన భూములను అలానే ఉంచండి, ఆ స్థలాలు ఎవరికీ ఇవ్వవద్దు. వాటిని స్వాధీనం చేసుకునే హక్కు కలెక్టర్‌కు లేదు:హైకోర్టు(07-07-2014)
వాహనాలకు పన్ను:
ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే వాహనాలపై పన్ను వసూలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయండి జీవో ప్రకారం పన్ను వసూలు చేయడం సరికాదు:హైకోర్టు(30-07-2014)
ఎంసెట్‌ అడ్మిషన్లు
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దు ఈ నెలాఖరులోపు కౌన్సిలింగ్‌ పూర్తి చేయండి. సెప్టెంబర్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభం కావాలి. మనసులో ఒకటి పైకి మరొకటి చేయొద్దు, ఇలాగైతే ఆ పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తాం:సుప్రీంకోర్టు(04-8-2014)
నెంబర్‌ ప్లేట్లు మార్చడంపై
నిబంధనలకు లోబడి ఒకసారి వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేశాక దాన్ని మార్చుకోవాలంటూ జీవో ఎలా ఇస్తారు? అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కోర్టులు జోక్యం చేసుకోక తప్పదు. వాహనదారులను ఎందుకు వేధిస్తున్నారు? ఇది మోటారు వాహనాల చట్టానికి విరుద్దం:హైకోర్టు(22-09-2014)
ఫాస్ట్‌ పథకంపై
కెతెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఫాస్ట్‌ పథకం దేశ సమగ్రతకే ముప్పు విధానాల రూపకల్పనలో జాతి సమగ్రతను దృష్టిలో పెట్టుకోవాలి తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగానికి సమైక్య స్పూర్తికి విరుద్దంగా ఉన్నాయి: హైకోర్టు(22-09-2014)
మార్కెటింగ్‌ కమిటీల రద్దుపై
వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తున్నాం:హైకోర్టు(07-11-2014)
కార్పొరేషన్‌ చైర్మన్స్‌కు కేబినెట్‌ హోదాపై
ఎవరికిపడితే వారికి కేబినెట్‌ హోదా కుదరదు-ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ వేసిన పిటీషన్‌పై వివరణ కోరిన హైకోర్టు(01-09-2015)
ఇసుక మాఫియాపై
ఇసుక మాఫియాలో పెద్దలున్నా జైల్లో పెట్టాల్సిందే-మహబూబ్‌నగర్‌లో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆదేశం (01-09-2015)
పంచాయతీ పారిశుద్ద్య కార్మికుల వేతనం పెంపుపై
ప్రభుత్వం బాధ్యతలను విస్మరిస్తోంది-రాష్ట్రంలోని పంచాయతీ పారిశుద్ద కార్మికుల వేతనాలతో తమకు సంబంధం లేదన్న తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి(01-09-2015)
తెలంగాణ భూభాగంలో ఏపి హైకోర్టు ఏర్పాటుపై
తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టు అసాధ్యం. కీలక తీర్పు వెల్లడించిన ఉమ్మడి హైకోర్టు(02-05-2015)
పార్లమెంట్‌ కార్యదర్శుల నియామకంపై
పార్లమెంటరీ కార్యదర్శులు నియామకం చెల్లదు-నియామకాల అమలును నిలిపివేసిన కోర్టు-మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన ధర్మాసనం(02-05-2015)
రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిని నియమించకపోవడంపై
రాష్ట్ర వినియోగదారుల ఫోరంకు అధ్యక్షుడ్ని నియమించకపోవడంపై కెసిఆర్‌ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు సూచించినా పట్టించుకోరా? సుప్రీం ఆదేశాలను లెక్కచేయరా? అంటూ ధర్మాసనం అసహనం(07-11-2015)
రైతుల ఆత్మహత్యలపై
రైతు ఆత్మహత్యలను చూస్తూ ఉండలేం-వాటిని అరికట్టే దిశగా ఏ చర్యలు ప్రారంభించారు? పంటల కనీస మద్దతు ధరలపై మీ వైఖరి ఏంటీ కేంద్రం తెలంగాణ ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు(08-09-2015)
బీటీ రాయల్టీపై
బీటీ రాయల్టీపై టీ సర్కార్‌కు మొట్టికాయ-స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ(13-11-2015)
కళింగుల తొలగింపుపై
కళింగులను వెనుకబడిన తరగతు జాబితా నుంచి ఎలా తొలగిస్తారు? టీ సర్కార్‌కు సుప్రీంకోర్టు ప్రశ్న(14-09-2015)
ఎన్టీఆర్‌ మైదానంలో కళాభారతి ఏర్పాటుపై
ఎన్టీఆర్‌ మైదానంలో కళాభారతి ఏర్పాటు చేస్తే పిల్లలు ఆదుకునేందుకు ఎంత స్థలం మిగులుతుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్న-క్రీడా మైదానాలే లేకపోతే గవాస్కర్‌, సచిన్‌లు ఉండేవారా? సర్కారు తలంపుపై కాదు. పిల్లల కోసమే మా తపనంతా వారు ఎక్కడ ఆడుకోవాలి? కళాభారతి నిర్మాణంపై ఉమ్మడి హైకోర్టు ప్రశ్న(15-07-2015)
తెలంగాణలో విద్యాచట్టం అమలుపై
తెలంగాణలో విద్యా చట్టాన్ని ఎందుకు అమలుచేయడం లేదు? చట్టమొచ్చి ఆరు ఏళ్లు కావస్తున్నా పట్టించుకోరా?(15-07-2015)
బీసీ జాబితా నుంచి కులాల తొలగింపు
మీరెలా తొలగిస్తారు? బీసీ రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న(15-09-2015)
పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలపై
పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలేవి? అసలు తీసుకుంటారా? లేదా? తీసుకుంటే ఎప్పటిలోగా తీసుకుంటారు? స్పీకర్‌ను అడిగి ఏదో ఒక నిర్ణయం చెబుతాం. తెలంగాణ ఏజీకి స్పష్టం చేసిన హైకోర్టు(17-07-2015)
గ్రేటర్‌ హైదరాబాద్‌లో పన్నుల వసూలుపై
అత్యవసర సేవలు మీరెలా ఆపేస్తారు? జీహెచ్‌ఎంసి కమీషనర్‌ సోమేష్‌కుమార్‌ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం-మోనార్క్‌లా వ్యవహరించద్దంటూ మందలింపు(27-03-2015)
భూ క్రమబద్దీకరణ జీవో అమలుపై
మీకు చేతకాకుంటే మేం చేయిస్తాం-భూ క్రమబద్దీకరణపై టీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయ. కోర్టు ఆజ్ఞలనే అమలు చేయరా అంటూ ఆగ్రహం(30-03-2015)
గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటనపై
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలెప్పుడు? వారంలో తేదీ చెప్పండి రాజ్యాంగాన్ని విస్మరిస్తారా? రాఫ్ట్రపతి పాలన లేదుకదా? సర్కార్‌పై హైకోర్టు ప్రశ్న(03-02-2015)
ఏపీ ఇంటర్‌ బోర్డు ఖాతాల జప్తుపై
ఏపీ ఇంటర్‌ బోర్డు ఖాతాలను ఎలా స్థంభింపజేస్తారు? తెలంగాణ ఇంటర్‌ బోర్డు,ఎస్‌బిఐని తప్పుపట్టిన హైకోర్టు(13-08-2015)
గ్రేటర్‌ వార్డుల కుదింపుపై
గ్రేటర్‌ వార్డుల కుదింపు ఎందుకు? వార్డుల సంఖ్యను తొలుత 200గా ప్రతిపాదించి తిరిగి 150 ఎందుకు కుదించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు(16-10-2015)
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి కూల్చివేతపై
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి భవనాన్ని హెరిటేజ్‌ భవనంగా తేల్చేదాక జోలికి వెళ్లవద్దు-ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి భవనంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు(18-04-2015)
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతపై
బడులకెళ్లని గురువులెందుకు వారిని సాగనంపండి -ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించవద్దు విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం-ప్రమాణపత్రం దాఖలు చేయండి-తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు(18-08-2015)
526 మందికి విద్యార్థులకు ఒక్క టీచర్‌ ఉండటంపై
526 మంది విద్యార్థులకు ఒక్క టీచరా? ఇది సర్కారు సిగ్గుపడాల్సిన విషయం-అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపుతారా? తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలున్నాయి? టీచర్లు ఎందుకు? ఖాళీలెన్ని? తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం(21-08-2015)
ఉపాద్యాయుల నియామకంపై
కొత్త రాష్ట్రమని ఎంతకాలం చెబుతారు? -ఉపాధ్యాయలు లేకుంటే స్కూళ్లు మూతపడవా? టీ సర్కార్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం(29-10-2015)
సింగరేణిలో వారసత్వ భర్తీ రాజ్యాంగ విరుద్దం
సాకుగా మారిన అనారోగ్యం-పథకం వివక్షాపూరితం-భర్తీ ప్రకటనను,పథకాన్ని రద్దు చేసిన హైకోర్టు(17-03-2017)
గ్రూప్‌-2 నియామక ప్రక్రియ నిలిపివేత
గ్రూప్‌-2 నియామక ప్రక్రియ 4 వారాల పాటు నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ(05-07-2017)
గురుకులాల్లో అన్ని పోస్టులు మహిళలతో భర్తీపై
అన్ని పోస్టులు-మహిళలకేనా రాజ్యాంగ విరుద్దం-గురుకుల జీవోపై హైకోర్టు స్టే 20-07-2017
సంపత్‌కుమార్‌,కోమటిరెడ్డిలపై అనర్హత వేటుపై
సంపత్‌కుమార్‌,కోమటిరెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. హైకోర్టు సంచలన తీర్పు – బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ రద్దు – అసెంబ్లీ స్థానాల ఖాళీ ప్రకటన నోటిఫికేషన్‌ కూడా. వారి శాసన సభ్యత్వాల పునరుద్దరణ-బహిష్కరణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్దం. నోటీసులు ఇవ్వలేదు. వివరణ తీసుకోలేదు. పిటీషనర్ల ప్రాథమిక హక్కులను హరించారు. ఒక్క కలం పోటుతో వారిని అనర్హులుగా చేశారు. వీడియే పుటేజీ ఇస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు(17-04-2018)
పంచాయతీ ఎన్నికలు-బీసీ రిజర్వేషన్ల అంశంపై
బీసీ జనాభా ఓటర్లను లెక్కించాకే నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, ఎబీసీడీఈ వర్గీకరణపై తర్వాత తేలుస్తామని స్పష్టీకరణ-ముందు బీసీ జనాభాను,ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వానికి ఆదేశం. అనంతరం ఆ వివరాలను ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని స్పష్టం చేసిన కోర్టు-ఇవన్నీ పూర్తి చేశాకే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది(26-06-2018)
క్రీడా కోటా కింద వృత్తి విద్యా ప్రవేశాలపై
క్రీడా కోటా రిజర్వేషన్ల కింద వృత్తి విద్యలో ప్రవేశాలను ఈ ఏడాది అమలు చేయరాదని తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం. క్రీడా కోటా కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 7ను టి.శ్రియ మరో నలుగురు సవాల్‌ చేసిన కేసులో కోర్టు ఆదేశాలు జారీ-క్రీడా కోటాపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఏసీబి దర్యాప్తునకు ఆదేశాలు జారీ(06-07-2018)
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే దానిపై
పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీ,ఎస్టీ,బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిబిఎన్‌ రాధా కృష్ణన్‌,జస్టిస్‌ రమేష్‌ రంగనాధన్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ.(09-07-2018)
సాంస్కృతిక సారధి నియామకాలపై
దరఖాస్తు చేసుకోకుండానే ఉద్యోగమా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా భర్తీయా ఇది సరికాదు, అర్హులకు అన్యాయం.-3 వారాల్లో తాజా నోటిఫికేషన్‌ ఇవ్వండి – 3 నెలల్లో భర్తీ పూర్తి చేయండి.హైకోర్టు ఆదేశం (10-07-2018)