విశాఖ జిల్లా నక్కపల్లిలో అలజడి

CAR
కారుతో పాటు అయిదుగురు అపరిచితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తీవ్రవాదులన్న అనుమానంతో విచారణ
నక్కపల్లి నుంచి బందోబస్తుతో విశాఖకు తరలింపు
విశాఖపట్నం : విశాఖ జిల్లా జాతీయ రహదారిలో నక్కపల్లి దరి టోల్‌ గేటు వద్ద బుధవారం అలజడి చెలరేగింది. పోలీసు బృందాలు పరుగు పరుగున అక్కడికి చేరుకొని ఓ కారును పక్కకు తీసుకువెళ్లి అందులో ప్రయాణిస్తున్న అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఆగమేఘాల మీద నక్కపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌ చుట్టూ ఆ ప్రాంతంలో ఉన్న పోలీసుస్టేషన్ల సిబ్బందిని మోహరించారు. లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పోలీసులు ఎవ్వరూ ఈ విషయంపై నోరు మెదపడంలేదు. హుటాహుటీన ప్రత్యేక వాహనంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విశాఖకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటిలిజెన్స్‌ వర్గాల సూచనల మేరకు జిల్లా ఎస్‌పి కార్యాలయం నుంచి ఓ సంక్షిప్త మైన సమాచారం ఇన్‌చార్జి డిఎస్‌పి రవీంద్రనాధ్‌కు అందింది. ఈమేరకు డిఎస్‌పి, సిఐ వెంకట్రావు నక్కపల్లి ఎస్‌ఐ రామకృష్ణ అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల ఉన్న స్టేషన్ల అధికారులు, సిబ్బందిని రప్పించారు. వీరంతా నక్కపల్లి సమీపంలోని టోల్‌ గేటు వద్ద మోహరించారు.

అదేసమయంలో టోల్‌ గేటు వద్దకు చేరుకున్న ఢిల్లీ రిజిస్ట్రేషన్‌కారును పక్కకు తీసుకువచ్చారు. అందులో ఉన్న ముఫ్పై నుంచి 40 సంవత్సరాల వయస్సుగల ఒక జంట, యాభైనుంచి 60 సంవ త్సరాల వయస్సుగల మరో జంటతోపాటు 16 సంవత్సరాల బాలుడుకూడా కారులో ఉన్నారు. వీరందరినీహుటాహుటిన నక్కపల్లిపోలీసు స్టేషన్‌కు తరలించారు. వారివద్దఉన్న పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. కారును క్షుణ్ణంగా పరిశీలించారు. కారులో ఎటువంటి మారణాయు ధాలు పోలీసులకు లభించలేదు. ఆ మహిళలిద్దరూ బురఖాలు తొలగించేందుకు నిరాకరించినట్టు తెలిసింది.

వారు ఇరాక్‌ దేశస్తులుగా చెప్పుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరాన్ని చూసేందుకు టూరిస్టు హోదాలో వీరి వచ్చినట్టు పోలీసులకు వివరించినట్టు తెలి సింది. అయితే పోలీసులుమాత్రం ఎటువంటి సమాచారం బయటకు పొక్కనివ్వలేదు. స్టేషన్‌ వద్ద పాత్రికేయుల హడావుడిపెరగడంతో ఉన్నతాధి కారులతో చర్చించిన స్థానిక పోలీసులు ప్రత్యేక వాహనంలో వారిని విశాఖకు తరలించారు. అయితే ఈనెల నాలుగు నుంచి ఏడవ తేదీ వరకూ విశాఖ నగరంలో అంతర్జాతీయస్థాయిలో ఫ్లీట్‌రివ్యూ జరగనుంది. ఈ రివ్యూకు భారత రాష్ట్రపతితో పాటు, ప్రధాని, నావికాదళ ఉన్నత స్థాయి అధికారులు నగరానికిరానున్నారు. ఈ నేపధ్యంలో వీరిరాక పలు అనుమానాలకు తావిస్తుండడంతో జిల్లా పోలీసుయంత్రాంగం అప్రమత్తంఅయ్యింది. దర్యాప్తు క్షుణ్ణంగా జరుగుతోంది. దీంతో పాటు నగరానికి బుధవారమే ఆక్టోపస్‌ బృందాలు చేరుకున్నాయి. విశాఖకు తరలిస్తున్న వీరిని జిల్లా పోలీసు అధికారులతో పాటు ఆక్టోపస్‌ బృందాలు ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విష యంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వివరణ కోరగా దర్యాప్తు జరుగుతోందని పూర్తిస్థాయి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.