విశాఖలో యోగా గురువుపై దుండగుల దుశ్చర్య

విశాఖ: నగరంలోని సంచలనం సృష్టించిన యోగా మాస్టర్ వెంకటరమణ హత్యకేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ అర్జున్ మీడియాకు తెలిపారు. వృత్తిపరంగా పోటీకి వస్తున్నారని కిరాయి హంతకులతో హత్య చేయించారని, ప్రధాన నిందితుడు కిలపర్తి వెంకటరమణ, అతని కుమారుడు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. వియత్నాంలోని తన కుమారుడి యోగా ఇన్స్టిట్యూట్కు..పోటీగా ఉన్నారని యోగా మాస్టర్ వెంకటరమణ హత్యకు కుట్ర పన్నారని, యోగా మాస్టర్ వెంకటరమణను ఇనుపరాడ్లతో కొట్టి చంపినట్లు అర్జున్ చెప్పారు. యోగా మాస్టర్ వెంకటరమణ హత్యకేసులో ఒప్పందం ప్రకారం కుట్రదారుడు సుపారీ డబ్బులు రూ.1.05 లక్షలు ఇవ్వకపోవడంతో.. నిందితులు కుట్రదారుడు కిలపర్తి వెంకటరమణపైనా హత్యాయత్నం చేశారని, నిందితులందరూ బర్మా క్యాంపు యువకులేనని ఏసీపీ అర్జున్ తెలిపారు. 8 మంది నిందితులపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.