వివాహేత‌ర సంబంధం.. యాసిడ్ దాడికి హేతువు

Acid Attack
Acid Attack

బెగుసారాయ్‌(బిహార్‌): యజమాని భార్యతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతనిపై యాసిడ్‌ దాడి చేశారు. బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాకు చెందిన బాధితుడు కొన్నాళ్లుగా ఓ రైతు ఇంట్లో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈనెల 6న వారిద్దరూ ఇంటినుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న రైతు తన భార్యను డ్రైవర్‌ కిడ్నాప్‌ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 16న రైతు భార్య వచ్చి స్థానిక కోర్టులో హాజరై తనను తీసుకెళ్లా్ల్సిందిగా భర్తను కోరింది. తర్వాత ఆమె మరిది శనివారం డ్రైవర్‌కు ఫోన్‌ చేసి ‘ఆమె మీతోనే ఉండాలనుకుంటోంది. ఆమె తెఘ్రా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంది. వచ్చి తనని తీసుకు పోవాలని కోరాడు. అనంతరం డ్రైవర్‌ పోలీసు స్టేషన్‌కు వస్తుండగా మార్గం మధ్యలో  20మంది దుండగులు  అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. అనంతరం అతడి కళ్లలో సిరంజితో యాసిడ్‌ పోసి అతన్ని తీసుకెళ్లి భగవాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హనుమాన్‌ చౌక్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అటువైపుగా వెళ్తున్న కొందరు బాధితుడ్ని చూసి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడికి చికిత్స చేసిన వైద్యులు యాసిడ్‌ దాడితో అతని కంటి చూపు పోయిందని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ బీ.కె సింగ్‌ తెలిపారు.