వివాహిత‌పై దారుణం

BREAKING NEWS
BREAKING NEWS

తూర్పుగోదావరిః కాకినాడ జైరామారావుపేటలో దారుణం చోటుచేసుకుంది. సర్పవరం పూల మార్కెట్‌ సమీపంలో నివాసం ఉండే ఓ వివాహితపై ప్రియుడి తల్లిదండ్రులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కాకినాడ ఒకటో పట్టణ పోలీసుల వివరాల మేరకు.. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన రావుల మల్లేశ్వరి(21)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం తన కుమార్తెతో కలిసి మల్లేశ్వరి అదే గ్రామంలో ఉన్నతన తల్లి ఇంటి వద్ద ఉంటోంది. వివిధ శుభకార్యాల్లో వంటపాత్రలు శుభ్రంచేసే పని చేస్తున్న ఆమెకు కాకినాడ జై రామారావుపేటకి చెందిన ఆటో డ్రైవర్‌ బి.గంగాద్రి పరిచమయ్యాడు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరూ మూడేళ్ల చిన్నారితో కలిసి జీవనం సాగిస్తున్నారు. వారం రోజులుగా గంగాద్రి మల్లేశ్వరి ఇంటికి వెళ్లడం మానేసాడు. ఈవిషయంపై నిలదీసేందుకు మల్లేశ్వరి తన తల్లితో కలిసి జై రామారావుపేటలోని గంగాద్రి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో గంగాద్రి ఇంట్లో లేకపోవడంతో అతని తల్లిదండ్రులతో గొడవకు దిగింది. ఆగ్రహంతో గంగాద్రి తల్లిదండ్రులు తమ కుమారుడి జోలికి రావద్దని పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. స్థానికుల సాయంతో మల్లేశ్వరి తల్లి కాకినాడ జీజీహెచ్‌ ఆస్పత్రిలో చేర్చింది. నిందితులు కామేశ్వరరావు, అతని భార్య అమ్మజీ ఒకటో పట్టణ పోలీసుల అదుపులో ఉన్నారు. మల్లేశ్వరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు.