విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

breaking newsbreaking news
breaking news

సైఫాబాద్‌: పంచాయితీరాజ్‌ చట్టంలోని బిసి రిజర్వేషన్‌ల శాతాన్ని 34 నుంచి 22 వరకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిని ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంద్‌ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బిసి సంఘాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసి ఓట్లతో గెలిచి పంచాయితీ ఎన్నకల్లో బిసి రిజర్వేషన్‌ల శాతాన్ని తగ్గిస్తే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెపుతామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌లను 34 శాతం నుంచి 22 శాతం వరకు తగ్గించడానికి ఎన్నికల కమిషన్‌, పంచాయితీరాజ్‌ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాయని ఈ ప్రతిపాదనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, రిజర్వేషన్‌లను తగ్గిచడమంటే బిసల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని యధావిధిగా రిజర్వేషన్‌లను కోనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిసి రిజర్వేషన్‌లు తగ్గించాలని సుప్రీంకోర్టు 2010లోనే తీర్పు ఇచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తగు కారణాలు చూపించి స్టే తీసుకురావడం జరిగిందని, 2013 ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయడం జరిగిందని, కెసిఆర్‌ రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రిజర్వేషన్‌లను తగ్గించకుండా చూడవలసిని బాధ్యత ఉందని, కొత్త ప్రభుత్వం తగ్గించిందనే అపవాదు మూట కట్టుకోరాదని కోరారు. బిసి రిజర్వేషన్‌లు తగ్గించుకోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉందని, టిఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యులు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టించడానికి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని, అలాగే సుప్రీంకోర్టులో పుల్‌ బెంచ్‌కు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆయన సూచించారు. పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టించి బిసిల జనాభా ప్రకారం రిజర్వేషన్‌లు కల్పించడానికి కెసిఆర్‌ చోరవ తీసుకోవలసిన అవసరం ఉందని బిసిల పక్షాన నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గత 25 సంత్సరాలుగా పంచాయితీరాజ్‌ సంస్ధలలో బిసిల రిజర్వేషన్‌లు 34 శాతం అమలు జరుగుతున్నాయని, ఎన్నో పోరాటాలు చేసి ఈ రిజర్వేషన్‌లను సాధించుకోవడం జరిగిందన్నారు. గత 7 దశాబ్దాలుగా అగ్రవర్ణాలు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారని, అయితే బిసిలకు సర్పంచ్‌గా చేయడానికి కూడా ఓర్చులేకపోవడం దుర్మార్గమన్నారు. ఈ తగ్గింపు వల్ల రెండు కోట్ల మంది బిసిల మనోభావాలు దెబ్బతింటాయని, రెండు లక్షల మంది సర్పంచ్‌లుగా, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిలర్స్‌గా అయ్యే అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షత వహించగా బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్‌, రాష్ట్ర బిసి విద్యార్ధి సంఘం కార్యదర్శి జైపాల్‌ముదిరాజ్‌, యువజన నాయకుడు గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.