విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రముఖి

breaking news
breaking news

సైఫాబాద్‌ : ట్రాన్స్‌ జెండర్స్‌, మానవుల అక్రమ రవాణ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం పున:సమీక్షించి, దేశవ్యాప్తంగా చర్చలు చేపట్టాలని ట్రాన్స్‌జెండర్స్‌ జెఎసి, వలస కార్మికుల సంక్షేమ సంఘం, జాతీయ సెక్స్‌ వర్కర్స్‌ సంఘం డిమాండ్‌ చేశాయి. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని ఆ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘాల ప్రతినిధులు, సిస్టర్‌ లిజిజోసఫ్‌, దేవిక, వైజయంతి, చంద్రముఖి, లైలా అశ్వీని, సోనురాథోడ్‌, పల్లవి, గంగా తదితరులు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి సెక్షన్‌ 370, 370ఎ ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ మానవుల అక్రమ రవాణా బిల్లు వల్ల ఎవ్వరికి ఓరిగేది ఏమి లేదన్నారు. మానవ నియంత్రణ చట్టం బాండెడ్‌ లేబర్‌ యాక్టు, ఇంటర్‌స్టేట్‌, వలస కార్మికులు, జువెనైల్‌ జస్టిస్‌ చట్టాలలో బిల్లుకు ఉన్న సంబంధమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుల ద్వారా 98 శాతం కార్మికులు మరింతగా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని, అలాగే మానవులు మోసంతో అమ్ముడుపోయే ప్రమాదం ఉందని, మానవులను కాపాడుతామనే నేపంతో పోలీసులకు అపారమైన అధికారాలు బిల్లు కట్టబెడుతున్నదని ఆరోపించారు. బిక్షాటన నిర్మూలన పేరుతో సమాజంలో వివక్ష, దోపిడీ, కుటుంబాల నుంచి వెలివేయబడ్డ హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్స్‌ను మానవ అక్రమ రవాణా పేరుతో నేరస్తులుగా మార్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యబిచారులు అనే పేరుతో సురక్షిత గృహాల్లోకి నెట్టివేస్తున్న అధికారులు బాధితుల జీవనాన్ని గమనించకుండా లైంగీక వేదింపులు, వ్యబిచారానికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. రాజ్యసభలో అమోదం పోందిన ఈ రెండు బిల్లులపై దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.