విరాట్ ముందు మ‌రో అరుదైన రికార్డు

virat kohli
virat kohli

సెంచూరియ‌న్ః టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఇప్పుడు మరో అరుదైన రికార్డు ఊరిస్తున్నది. క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు ఇప్పటివరకు ఒకే ఒక క్రికెటర్‌కు సాధ్యమైంది. అతడు వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్. ఒకే టూర్‌లో వెయ్యి పరుగులు సాధించిన ఘనత అది. 1976లో ఇంగ్లండ్‌పై రిచర్డ్స్ ఈ రికార్డు సృష్టించాడు. ఆ టూర్‌లో రిచర్డ్స్ మొత్తం 1045 రన్స్ చేశాడు. నాలుగు టెస్టుల్లో 829 పరుగులు, వన్డేల్లో 216 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో ఇప్పటివరకు 870 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 3, వన్డేల్లో ఒక సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 13 ఇన్నింగ్స్‌లో 87 సగటుతో కోహ్లి 870 రన్స్ చేయడం విశేషం. కోహ్లి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 286 రన్స్ చేయగా.. 6 వన్డేల్లో 558 రన్స్ చేశాడు. తొలి టీ20లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరో రెండు టీ20లు మాత్రమే మిగిలున్న సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ మరో 130 పరుగులు చేయగలడా అన్నది డౌటే. ఇక రెండోస్థానంలో డాన్ బ్రాడ్‌మన్ ఉన్నాడు. బ్రాడ్‌మన్ కూడా ఇంగ్లండ్ టూర్‌లోనే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 974 రన్స్ చేశాడు. ఇప్పుడీ రికార్డు బ్రేక్ చేయాలన్నా.. విరాట్ మరో 104 పరుగుల దూరంలో ఉన్నాడు.