విద్యార్థి ఆత్మహత్యతో నాకు.. బిజెపికి సంబంధం లేదు : కేంద్ర మంత్రి దత్తాత్రేయ

Dattatreya
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సెంట్రల్‌ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్ధి రోహిత్‌ ఆత్మహత్యతో తనకుగానీ, భారతీయ జనతా పార్టీకి కాని ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌, విసి అప్పారావు, ఎబివిపి నాయకుడు సుశీల్‌కుమార్‌లపై యూనివర్శిటీ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి తాను కేంద్ర మంత్రి హోదాలో రాసిన లేఖ కీలకమై, అందువల్లే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్‌సియు శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని, జాతివ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తనకు అందిన సమాచారంతో తాను విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌కు లేఖ రాశానన్నారు. ఎబివిపి కార్యకర్తలను కొంతమంది దారుణంగా కొట్టినందునే తాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు లేఖ పంపానని, ఆపై ఏం జరిగిందన్నది తనకు తెలియదని దత్తాత్రేయ స్పష్టం చేశారు. విద్యార్ధి రోహిత్‌ ఆత్మహత్యకు తనకుగానీ, తన పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. విచారణ జరిగితే… అన్ని విషయాలూ బయటకు వస్తాయని, తనపై పెట్టిన కేసుల గురించి ప్రస్తుతం వ్యాఖ్యానించబోవని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు.