విద్యారంగాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

జనవరి 6,7,8 తేదీల్లో పిడిఎస్యు రాష్ట్ర ప్రథమ మహాసభలు
వర్సిటీలను ప్రైవేటీకరిస్తే ప్రతిఘటిస్తాం
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని పలువురు వక్తలు ఆరోపించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్యు) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సయ్య, ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, అనూరాధ, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరేందర్, రాష్ట్ర కార్యదర్శి ఎం.పరుశురామ్, పిడిఎస్యు గ్రేటర్ అధ్యక్షుడు డి.ఎ.రాము, రియాజ్, గణేష్, విజయా, రంజిత్, సరళ, రోషిణీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను ప్రైవేటీకరించే ఆలోచనలుచేస్తోందని, ఇటువంటి కుట్రలను తాము తిప్పికొడుతామని, ఈ విషయంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో ఉపాధ్యాయులుల లేక సక్రమంగా విద్యఅందడం లేదని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందని, ఉద్యోగవకాశాలు లేకవిద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.