విడాకులు తీసుకుంటే తప్పులేదు

వ్యధ

(ప్రతి గురువారం)

Sad
Sad

విడాకులు తీసుకుంటే తప్పులేదు

తాళికట్టిన వాడు తాగుబోతైతే భరించవచ్చు. భర్త కిరాతకుడయినా సహించవచ్చు. భార్య నగ్న దృశ్యాలను చాటుగా చిత్రీకరించి ఆనందించే శాడిష్టుడు, నీతిరహిత వర్తనుడైన నా భర్తకు విడాకులివ్వడంలో తప్పు లేదనుకుంటాను. అయితే మా తల్లిదండ్రులు, పెద్దమనుషులు సెంటిమెంట్లు చెప్పి నరకకూపంలోనే జీవించమంటున్నారు. నా పరిస్థితులను పరిశీలించి చక్కని పరిష్కారం సూచిస్తారన్న ఆశతో వివరాలు రాస్తున్నాను. నా వయసు 25 సంవత్సరాలు. బి.టెక్‌ పూర్తి చేసి బహుళ జాతీయ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఏడాదిక్రితం పెళ్లయింది. వివాహానంతరం ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటూ నా భర్త ఉద్యోగాన్ని మాన్పించేశాడు. పెళ్లి చూపుల సమయంలో తాను ఎం.బి.ఎ చేశానని, ఇద్దరం ఒకే ఊరిలో ఉద్యోగం చేద్దామని నమ్మించాడు. పెళ్లయిన తరువాత అతను డిగ్రీ మాత్రమే చదివాడని తెలిసింది. తప్పెందుకు చెప్పావని నిలదీస్తే, వంద అబద్దాలు ఆడి పెళ్లి చేసుకున్నా తప్పు కాదన్న సామెతను గుర్తు చేశాడు. రెండేళ్లలో దూరవిద్య ద్వారా ఎం.బి.ఎ పూర్తి చేస్తానని హావిూ ఇచ్చాడు. చదివే ప్రయత్నం చేయకపోగా భార్య ఉద్యోగం చేస్తే భర్తకు అవమానమని నన్ను మాన్పించేశాడు.

దీంతో ఇద్దరం కలిసి చిరు ఉద్యోగి అయిన మా మామగారి సంపాదనపై ఆధారపడవలసి వచ్చింది. ఇక చేసేది లేక సర్దుకుని జీవిద్దామని నిర్ణయించుకున్నాను. అయితే మా అత్తమామల పోరు ప్రారంభమయ్యాయి. పెళ్లపుడు ఇచ్చిన ఐదులక్షల కట్నం చాలవని మరో పది లక్షలు కట్నం తెమ్మని బలవంతం పెట్టడం ప్రారంభించారు. మా నాన్న కూడా చిన్న ప్రభుత్వ ఉద్యోగే. ఆయనకు వచ్చే జీతం పొదుపుగా కూడబెట్టి ఒక ఇల్లు కట్టుకున్నారు. నన్ను చదివించి, తగిన లాంఛనాలు, కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. అన్ని కలిపి నా పెళ్లికి పదిహేను లక్షలు ఖర్చు చేశారు. అందుకోసం ఐదు లక్షల వరకు బయటి వ్యక్తుల వద్ద అప్పు చేశారు. ఈ స్థితిలో తాను అదనపు కట్నం ఇవ్వలేనని మా నాన్న తేల్చి చెప్పారు. నేను ఏకైక సంతానం కావడం వల్ల, తమ తదనంతరం 50 లక్షలు విలువగల ఇల్లు నాకే వస్తుందని సర్ది చెప్పారు.

అందుకు మా అత్తమామలు సమ్మతించలేదు. ఇల్లు తాకట్టు పెట్టి లేక అమ్మేసైనా తమకు కట్నం అదనంగా ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డారు. మా నాన్న గత్యంతరం లేక ఏడాది సమయం కావాలని కోరారు. అయినా సంతృప్తిపడని నా భర్త, అత్తమామలు నన్ను వేధించడం ప్రారంభించారు. నా భర్త దొంగ చాటుగా, నేను స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీశాడు. వాటిని యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు. మా మామ ఓ రోజు నేరుగా బెడ్‌రూమ్‌లో వ్ఞన్న నా వద్దకు వచ్చి చేయి పట్టుకుని బలత్కారం చేశాడు. ఆ విషయం మా వారికి చెబితే కట్నం పది లక్షలు తెచ్చేవరకు ఇలాంటివి తప్పవని హెచ్చరించాడు. ఇక భరించలేక ఆ నరకకూపం నుంచి బయటపడి పుట్టింటికి వచ్చేశాను. అక్కడి మహిళా పోలీసులను ఆశ్రయించాను. వారు అక్కడి సైకాలజిస్టుల సహాయంతో నా భర్త, అత్తమామలకు కౌన్సెలింగ్‌ చేశారు. నేను అప్పటికే గర్భవతిని కావడంతో సర్ది చెప్పి వారితో పంపించారు. అత్తవారి ఇంటికి వెళ్లిన మూడో రోజే తీవ్రస్థాయిలో కొట్టి హింసించారు. దాంతో అబార్షన్‌ జరిగి, తీవ్రరక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయించారు. మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్సానంతరం తిరిగి పుట్టింటికి వచ్చేశాను. ఇక పూర్తిగా తెగతెంపులు చేసుకుని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే కుటుంబ పరువుపోతుందని, జీవితం మోడువారుతుందని భయపెట్టి మళ్లీ అత్తారింటికి పంపేందుకు అందరు ప్రయత్నిస్తున్నారు. నన్నేమీ చేయమంటారు? విడాకులు తీసుకుంటే జీవించలేనా? తెలుపగలరు. – కీర్తన, అనంతపురం

అమ్మా! విడాకులు తీసుకోవడం అన్నది అన్ని సందర్భాలలోను తప్పుకాదు. వ్యక్తిగత రక్షణ, స్వేచ్ఛను సంరక్షించేందుకే విడాకులు చట్టం రూపొందిం చారు. వివాహబంధం భµరించలేని స్థితి పరిణమించినపుడు విడాకులే శరణ్యం కావచ్చు. విూ పరిస్థితులను విశ్లేషిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. సహజంగా విడాకులు పొందిన స్త్రీలు సమాజంలో పలు సమస్యలు, అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. కారణం ఏదైనప్పటికి విడాకులు పొందిన స్త్రీనే లోకులు విమర్శిస్తుంటారు. భర్త తోడు కరువైన మహిళల్ని వేధించే కామపిశాచాలు ఎదురవ్ఞతుంటాయి. ఒకవేళ తిరిగి పెళ్లి చేసుకున్నా, భర్త ఆదరణలో తేడాలు వ్ఞంటే అవకాశాలు వ్ఞంటాయి. అలాగే పలువ్ఞరు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. ఇలాంటి వాటికి భయపడి మీ తల్లిదండ్రులు విడాకులను వ్యతిరేకిస్తుండవచ్చు. అయితే మీ భర్త, అత్తమామల తీరు చూస్తే విడాకులు తీసుకోవడమే మేలు అనిపిస్తుంది.

భార్య నగ్న దృశ్యాలను చిత్రీకరించి యూట్యూబ్‌లో పెడతానని బెదిరించే నీచమన స్కునితో కలిసి కాపురం చేయడం నరకప్రాయమే. కూతురులాంటి కోడల్ని బలవంతం చేసిన మామనీడలో ధైర్యంగా తిరగడం ఎవరి తరమూ కాదు. ఆధునిక సమాజంలో కూడా కట్నం కోసం వేధించే అత్తను సాటి మహిళగా గుర్తించి ఆదరించడానికి ఎవరికీ మనస్కరించదు. విడాకుల వల్ల ఎదురయ్యే సమస్యల కంటే కలిసి ఉంటే తలెత్తే కష్టాలు భరించలేనివైనపుడు విడాకులే మేలు అన్నది నా అభిప్రాయం. మీరు బి.టెక్‌ చదివి ఉద్యోగం చేసిన అనుభవం సంపాదించారు. కాబట్టి తిరిగి మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం వ్ఞంది. అలాగే వయసు తక్కువే కాబట్టి తిరిగి పెళ్లి చేసుకోవచ్చు. తల్లిదండ్రులకు భారం కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగకుండా జీవనం సాగించే అవకాశాలున్నాయి. కాబట్టి విడాకులు తీసుకుని, ఉద్యోగంలో చేరి, తగిన వ్యక్తిని పెళ్లి చేసుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు. అయితే మరో వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు విూ వివరాలు చెప్పడం మంచిది. మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటే మళ్లీ కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఈ రోజుల్లో అన్ని అర్ధం చేసుకుని ఆదరించగల అబ్బాయిలు ఉన్నారు. అయితే తొందరపడకుండా చక్కగా ఆలోచించి, విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకోండి.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌ రెడ్డి, సైకాలజిస్ట్‌