వాట్సాప్‌తో ఇన్సూరెన్స్‌ సమాచారం

Whatsapp
Whatsapp

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ వినియోగం పెరిగిన తర్వాత ఏ సమచారమైన నిమిషల్లో తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా భారతీయ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇప్పుడు వాట్సాప్ సేవలను ప్రారంభించాయి. దీని వల్ల ప్రతి కస్టమర్ తన ఇన్సూరెన్స్ పాలసీకి చెందిన సమాచారాన్ని నిమిషాల్లో తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండటంతో కంపెనీలు ఆ మెసేజింగ్ యాప్‌ను తమ సేవల కోసం వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు, కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నా.. సమీప భవిష్యత్తులోనే ఇవి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాట్సాప్ సేవలను ప్రారంభించాయి. వాట్సాప్ ద్వారా సమాచారం పొందేందుకు అంగీకారం తెలిపిన కస్టమర్లు పాలసీ సర్టిఫికెట్లు, ప్రిమియం రిసీట్లు, పన్ను సర్టిఫికెట్లు పొందేందుకు వీలుంటుంది అని సంస్థ డిప్యూటీ ఎండీ పునీత్ నందా వెల్లడించారు.
వాట్సాప్ ద్వారా ఎలా?

ఓ కస్టమర్ తన పాలసీ ఫండ్ విలువ తెలుసుకోవాలి అనుకుంటే..

• సదరు కంపెనీ వాట్సాప్ నంబర్ తెలుసుకొని అందులో ఫండ్ వాల్యూ తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని టైప్ చేయాలి. అప్పుడు సంస్థ సదరు కస్టమర్ పాలసీ నంబర్ అడుగుతుంది
• పాలసీ నంబర్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
• ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సమాచారం వస్తుంది. దీని వల్ల సరైన వ్యక్తికే సరైన సమాచారం ఇస్తున్నామన్న భరోసా సంస్థకు కలుగుతుంది
• ఫండ్ విలువ తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమైనా సమాచారం కావాలా అన్న విషయాన్ని కూడా అడుగుతుంది.