వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం

POCHARAM
POCHARAM

హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు బీమా పరిహారం వచ్చేవిధంగా కృషి చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధిక వర్షాలతో కొంత మేర పంట నష్టం సంభవించినట్లు నివేదికలు అందాయని తెలిపారు. ఈ జిల్లాలో పత్తి 97 వేల ఎకరాలు, కంది 8,200 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారని చెప్పారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు వివారాలను సేకరించి వాటిని బీమా కంపెనీలకు పంపించాలని ఆదేశించారు. పంట నష్టంపై రైతులకు పరిహారం సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, పంటల సాగు, బీమా, పంటలకు తెగుళ్లు తదితర వాటిపై సచివాలయంలో సోమవారం మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం వానాకాలం సాగు 86 శాతానికి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.08 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటి వరకూ 94 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వివరించారు. గత ఏడాదితో పోల్చితే ఆరు లక్షల ఎకరాల్లో ఎకుకవగా పంటలను సాగు చేసినట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మంచి వర్షాలు కురియడంతో నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, ఇతర ప్రాజెక్టులు, చెర్వుల్లోకి నీరు పుష్కలంగా చేరిందని తెలిపారు. దీంతో వానాకాలం సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక ఆదిలాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట్‌, ఖమ్మం, వరంగల్‌, గద్వాల, మెదక్‌, వనపర్తి జిల్లాలు సాగులో వెనుకంజలో ఉన్నాయన్నారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతం మంచి వర్షాలు పడడంతో సాగు విస్తీర్ణం పెరగనుందని వెల్లడించారు. కాగా రైతు బంధు, బీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 26,52,741 మంది రైతులకు సంబంధించిన బీమా బాండ్ల ముద్రణ, పంపిణీ జరిగిందని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబంలోని నామినీకి సకాలంలో బీమా పరిహారం ఇప్పించడం అధికారుల సమర్థతపై ఆధారపడి ఉందని చెప్పారు. రైతు బీమా పథకంలో ఇప్పటి వరకూ 135 మంది రైతుల మరణాలు నమోదు కాగా, 110 మంది వివరాలు నమోదయ్యాయని వివరించారు. ఇందులో 107 మంది రైతుల వివరాలను జీవిత బీమా సంస్థకు పంపగా, వీరిలో 75 మంది నామిని ఖాతాలకు బీమా పరిహారం అందించారని పేర్కొన్నారు. రైతు బీమాపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పంటల బీమాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని చెప్పారు. 2015-16 సీజనులో బీమా ప్రీమియంకు సంబంధించి 70.49 కోట్ల రూపాయలు, 2017 వానాకాలంలో 222.55 కోట్ల రూపాలయను ప్రభుత్వం తన వాటా కింద చెల్లించిందన్నారు. దీనికిగాను బీమా కంపెనీలు 258.52 కోట్ల రూపాయలు, 496.98 కోట్ల రూపాయలను పరిహారం కింద రైతులకు చెల్లించనున్నాయని తెలియచేశారు. మరోపక్క ఈనెల చివరి వరకూ వరి పంటకు బీమా గడువు ఉందని, రుణం తీసుకోని రైతులు ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మొక్కజొన్నపై కత్తెర పురుగు సోకినట్లు నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించి నివారణ చర్యలను తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి మాట్లాడుతూ రాష్ట్రంలో కత్తెర పురుగు 13 జిల్లాలకు వ్యాపించినట్లు సమాచారం ఉందన్నారు. తొలుత మొక్కజొన్నపై ఆశించినప్పటికీ ఆ తదుపరి అన్ని పంటలకు విస్తరించే వీలుందని చెప్పారు. దీని నివారణకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల మధ్య సహకారంతో ఐకార్‌ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.