వనవాసంలో రామరాజ్యం

SRI RAMA
SRI RAMA

వనవాసంలో రామరాజ్యం

”శ్రీరాముడు అరణ్యవాసానికి వెడలినప్పుడు అయోధ్యావాసులు విషాదంలో మునిగిపోయారు. కాని ఆయన అరణ్యవాసం వనవాసులకు, పశు, పక్షి, మునిజనులకు స్థిరమైన జీవితాన్ని ప్రసాదించింది. బుషులు ప్రశాంతంగా తపస్సు సాగించారు. భిల్లులు, కోయలు, గోండులు మొదలైన వనచరులు రాక్షసుల నుండి భయము లేకుండా! ఆనందంగా జీవించారు. పుష్కలంగా ఆహారం లభించింది. పుట్ట-తేనెలు పండ్లు, కందమూలాలు భేదభావం లేకుండా అందరం కలిసి పంచుకున్నారు. శ్రీరాముడు నివసించే అరణ్యం అంతా ఒక రాజ్యము. ఆ రాజ్యానికి రాజు వివేకం. శ్రీరాముడు వివేకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. వివేకానికి మంత్రి వైరాగ్యం.

శ్రీరామునికి సలహాలు ఇచ్చేవారంతా వైరాగ్యాన్ని కలిగిన బుషులు. వారంతా భౌతిక వాంఛలు లేనివారు. రాజుకు అహింస, సత్యము పలుకుట, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనగా ఇతరుల నుండి ఏమి తీసుకోకపోవడము అనేవి రాజుకు లక్షణాలు. ధర్మసూక్ష్మము చాలా విచిత్రమైనది. అహింసా పరులయిన వారిని బాధించిన వారిని మాత్రమే శ్రీరాముడు సంహరించాడు. ఆయన వనవాసంలో సంచరిస్తూ ఉండగా ఒకచోట ఎముకల గుట్ట ఒకటి కనబడింది. అక్కడి వారిని అడుగగా, రాక్షసులు చంపి తిన్నవారివని, అక్కడివారు చెప్పారు. ఆయనకు చాలా కోపము వచ్చింది. వెంటనే కోదండం సంధించి సమూలంగా రాక్షసులకు నిర్మూలిస్తానని శపథం చేసాడు.

ఆ అరణ్యానికి రాజధాని పర్వతం. ”శౌచము అనగా యమము, సంతోషము, తపస్సు, ఈశ్వరధ్యానము వనరాజు లక్షణాలు. వనరాజుకు సుబుద్ధి, శాంతి అనే ఇద్దరు రాణులు కలదు. వారు ఎల్లప్పుడు వివేకిని అంటిపెట్టుకుని సలహాలు ఇస్తూ ఉంటారు. మంచి మనస్సు ఈ రాజ్యానికి కోశాగారము. ఈ కోశాగారము ఎప్పుడు ఖాళీ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా శ్రీరాముని వనవాసము ప్రారంభం అయింది. ”నగరము అనగా అడవి వనసంపదలతో, తులతూగుతూ ఉంది. కాలానుసారము జరుగవలసినవి అన్నా! సక్రమంగా జరుగుతున్నాయి. భరతుడు శ్రీరాముని దర్శించి, ఆయనను అయోధ్యా నగరానికి తీసుకుని వెడదామని, ససైన్యంగా, వశిష్ఠుని వంటి గొప్ప ధార్మికవేత్తలతో, కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో అరణ్యమార్గాన వస్తున్నాడు. దారిమధ్యలో ఆయనకు బుషి వాటికలు దర్శనమిచ్చాయి. యజ్ఞయాగాదులు చక్కగా జరుగుతున్నాయి.

ప్రకృతి కూడా ప్రశాంతంగా ఉంది. భరతుని సైన్యం కూడా! ఏమాత్రము అలజడి లేకుండా, చక్కగా సాగుతోంది. వారి మనసులలో అక్కడి వాతావరణము ఆధ్యాత్మిక భావాలను ప్రవేశపెట్టింది. జంతువ్ఞలు పరస్పరం వైరాన్ని మాని స్నేహంగా సంచరించసాగాయి. వారి వారి మనస్సులలో కోరికలు గ్రహించినట్లుగా అక్కడ ఉండే కోలలు, కిరాతులు మొదలైన వనచరులు, మధురమైన పండ్లను చక్కటి తేనెను ఆకుదొన్నెలలో తెచ్చి ఇచ్చారు. భరతుడు వారి యోగక్షేమాలు విచారించి వారికి, ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించగా వారు తిరస్కరించారు.

రాముడు నడచిన ప్రదేశంలో ఎవ్వరికి ఏమి కొరత ఉండదని స్పష్ఠము చేసారు. అందుకే ”అన్నమో! రామచంద్రా అనే మాట మన తెలుగునాట పుట్టింది. శ్రీరాముడు ఎక్కడయితే సంచరించాడో అక్కడ ఎవ్వరికి కొరతలేదు. భరతుడు పరివారంతో వస్తున్నట్లు తెలిసి భరద్వాజ బుషి వారి ఆతిథ్యం ఇవ్వ సంకల్పించాడు. వెంటనే అణిమాది అష్టసిద్ధులు ప్రత్యక్షం అయ్యాయి. అవి బుషికి ఆ అవకాశము వాటికి ఇవ్వమని పదేపదే ప్రార్థించాయి. ఆయన అంగీకరించాడు. అవి ఆయన శిష్యుల ఆకారాలు ధరించి, భరతునికి మిగిలిన వారికి దేవేంద్ర భోగాలు అందించాయి. భరతుడు చిత్రకూట పర్వతము వద్ద, ఆశ్రమంలో ఉన్న శ్రీరాముని వద్ద వెళ్లి, ఆయన దృఢనిశ్చయాన్ని మార్చలేక ఆయన పాదుకలు తీసుకుని అయోధ్యకు వెళ్లిపో యాడు. శ్రీరాముడు చిత్రకూట పర్వతాన్ని సీతాలక్ష్మణులతో వదిలి దక్షిణదిశగా ప్రయాణము సాగించాడు.

దారిమధ్యలో అనేకమంది రాక్షసులను సంహరిం చాడు. అత్రి మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడ సీతాదేవి అనసూయాదేవి వలన అనేక కథలు, నీతులు తెలుసుకుంది. దివ్యాభరణాలు ఆమెకు అనసూయాదేవి ఇచ్చింది. ఈవిధంగా శ్రీరాముని అరణ్యవాసం జరిగింది.

– ర్యాలి రమాసీత