వణ్యప్రాణుల రక్షణ పేరుతో అభివృద్ధిని అడ్డుకోవద్దు : సుప్రీంకోర్టు

supreme_court
నాగ్‌పూర్‌-జబల్‌పూర్‌ 7వ నంబరు జాతీయ రహదారి అనుమతుల విషయంలో వ్యాజ్యం
హైదరాబాద్ : అటవీ ప్రాంతం, వణ్య ప్రాణుల రక్షణ కారణాలతో అభివృద్దిని అడ్డుకోవడం తగదని సుప్రీంకోర్టు హితవు పలికింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్పీ.ఠాకూర్‌, జస్టిస్‌ ఏకే.సిక్రీ, జస్టిస్‌ ఆర్‌ భానుమతిలతో కూడిన ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసింది. అయితే సదరు వ్యాజ్యం ఉద్దేశ్యపూర్వకంగా దాఖలు చేశారన్న వాదనలు ఉన్న నేపథ్యంలో ధర్మాసనం వ్యాఖ్యలను పలువురు సమర్థించారు. నాగ్‌పూర్‌ నుంచి జబల్‌ పూర్‌ వరకు ఉన్న7వ నంబరు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఆ రహదారి టైగర్‌ జోన్‌ మీదుగా వెళుతున్నది. ఆ పనులను ఆపాలని, అక్కడ పనులు జరుగడంతో ఆ ప్రాంతంలోని పులులకు ఇబ్బంది కలుగుతుందని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అక్కడి రహదారిని విస్తరించడం వలన ట్రాఫిక్‌ పెరగడంతో కాలుష్యం, శబ్దాలు పెరుగుతాయని కోర్టుకు వివరించారు. కావున అక్కడి పనులను ఆపాలని కోరారు. ఆ వ్యాజ్యాన్ని పరిశీలించిన కోర్టు పులుల రక్షణ అవసరమే అంతకు మించి దేశాభివృద్ది చాలా అవసరం అని వ్యాఖ్యానించింది. కాగా అక్కడ రహదారి ఎప్పటి నుంచదో ఉందని ఇప్పుడు విస్తరణ మాత్రమే జరుగుతున్న విషయంను కోర్టు గుర్తు చేసింది. అంతే కాక విస్తరణ పనులు సదరు టైగర్‌ జోన్‌లో చాలా తక్కువ పరిధిలో మాత్రమే జరుగుతున్నట్లు కోర్టు గుర్తించింది. దీంతో ఆ పిటిషన్‌పై పై వ్యాఖ్యలు చేయడమే కాక పిటిషనర్‌ పులుల సంరక్షణకు సంబంధించిన పనులలో పాల్గోనాలని తద్వారా వణ్యప్రాణుల సంరక్షణ చేయాలని చిన్నపాటి చురక అంటించింది. పిటిషన్‌ను కోట్టి వేసింది.