వచ్చేవారం ఇటలీలో పెళ్లివేడుక !

kohli anushka sharma
kohli anushka sharma

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌తార అనుష్క శర్మ ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి మధ్య చాలా రోజులుగా సాగుతున్న ప్రేమాయణం ఎట్టకేలకు పరిణయంగా మారనుంది. వచ్చేవారం ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లివేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయని ప్రచారం వినిపిస్తోంది.

9 నుంచి 12వ తేదీ దాకా నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరుగుతాయని, ఇందుకు ఇటలీలోని మిలాన్‌ నగరం వేదిక కాబోతోందని వినికిడి. పెళ్లివేడుక ఘనంగా జరుగుతుంది, మిత్రులు, సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఇదివరకు వార్తలు వచ్చాయి. ఈ యేడాది ప్రారంభంలోనే డిసెంబర్‌ ముహూర్తాన్ని నిర్ణయించారన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు కోహ్లీ గానీ, ఇటు అనుష్క శర్మ వైపునుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలావుండగా, అనుష్క తరఫు ప్రతినిధి పెళ్లి వార్తను కొట్టిపారేశారు. ఇందులో నిజం లేదని, ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పాడు. కాగా, వారం రోజుల కిందట జరిగిన జహీర్‌ఖాన్‌ పెళ్లి వేడుకలో వీళ్లిద్దరు డ్యాన్స్‌ చేసి అలరించారు. అంతేకాదు, ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్‌ పేరుతో క్రీడాకారులకు పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని కోహ్లీ ప్రారంభించగా, ఇందుకు అనుష్క పూర్తిమద్దతు తెలిపింది.

2013 నుంచి వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని విరాట్‌ కోహ్లీ బహిరంగంగానే ప్రకటించాడు కూడా. కోహ్లీ ఆటను చూసేందుకు అనుష్కశర్మ దేశ, విదేశాలకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.