వంద కోట్ల మంది అభిమానులు

FANS
FANS

వంద కోట్ల మంది అభిమానులు

క్రికెట్‌కు భారత్‌లో ఉన్నంతగా అభిమానులు ప్రపంచంలో ఎక్కడా లేరనేది వాస్తవమే. కానీ. ప్రపంచ వ్యాప్తంగా అస్సలు లేరనేది కాదు. ఈ విషయంపై ఐసిసి తాజాగా ఓ సర్వే నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు వంద కోట్ల మంది క్రికెట్‌ అభిమానులు ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఇందులో 90శాతం వరకు భారత్‌ ఉపఖండం నుంచే ఉండటం విశేషం. ఐసిసి ప్రఖ్యాత ఛానెల్‌ నీల్సన్‌ స్పోర్ట్స్‌ ద్వారా ఈ సర్వేను నిర్వహించింది. మరో విశేషం ఏమిటంటే…వీళ్లలో 39శాతం మహిళాభిమానులే ఉండటం. అంటే దాదాపు మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా క్రికెట్‌ను ఇష్టపడుతున్నారు.

ఐసిసి తన అధికారిక వెబ్‌సైట్‌, ట్విట్టర్‌లో ఈ సర్వే ఫలితాలను ఐసిసి పోస్టు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 16 నుంచి 69ఏళ్ల మధ్య క్రికెట్‌ అభిమానులకు సర్వే చేశారు. క్రికెట్‌ అభిమానులు సగటు వయసును 34గా తేల్చారు. అంతేకాదు క్రమంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుందని ఈ సర్వే స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వాళ్లలో 70శాతం మంది మహిళల క్రికెట్‌కు మరింత లైవ్‌ కవరేజి ఇవ్వాలని కోరారు.

ఇక అభిమానుల్లో మూడింట రెండో వంతు మంది మూడు ఫార్మట్లను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. ఐసిసి వరల్డ్‌ కప్‌, టీ20 వరల్డ్‌ కప్‌లకు విపరీతమైన ఆదరణ ఉండటం విశేషం. 95శాతం మంది ఈ టోర్నీలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇంగ్లాండ్‌ విషయానికొస్తే అక్కడ టెస్టు క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మరే ఫార్మట్‌కు లేదంట. ఆ దేశంలో 70శాతం మంది అభిమానులు టెస్టు క్రికెట్‌నే ఇష్టపడుతున్నటుల సర్వే వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో వన్డేలకు, పాకిస్తాన్‌లో టీ20లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్లు తెలిసింది. ఇక మూడు ఫార్మట్లలో టీ20లకే ఎక్కువ ఆదరణ ఉంది. 87శాతం మంది ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఉండాలంటే కోరుకుంటున్నారనీ ఈ సర్వే స్పష్టం చేసింది.