లోపిస్తున్న మానవతా విలువలు

HAPPY MOVEMENTS
happu Family

లోపిస్తున్న మానవతా విలువలు

నిత్యం ఎన్నో సమస్యలతో సత మతమయ్యే జీవితం ఓదార్పుకోసం తోడును కోరుకుంటుంది. ఆ తోడు తల్లి గర్భంలో పిండంగా ఆవిర్భవిం చినప్పటి నుంచి ఈ పుడమిపై కాలుమోపి పరుగులెత్తి తుదిశ్వాస విడిచే వరకు. అక్కడే ఉదయిస్తాయి మానవ సంబంధాలు. ప్రస్తుతం ఆ విలువలు ఏమౌతున్నాయో ఒక్క క్షణం… ఒకే ఒక్కక్షణం ఆలోచించండి. ‘నువ్వు ప్రేమించబడాలంటే… ముందుగా ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి అపుడే నీకు గౌరవం.

తల్లి, తండ్రి, గురువు, భార్య, భర్త, పిల్లలు, సమాజం ప్రతీది మన ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రకృతిని, పశు పక్ష్యాదులను ప్రేమించినంతగా సాటి మనిషిని ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. ఇది చాలా విచారకరం. సంపాదన వ్యామోహంలో మనిషి నిలువెత్తు దహించుకుపోతున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరును విడిచి పరదేశాల వెంటపడుతున్నాడు. ఈ వ్యామోహం ఎదుటి వాడిని గుర్తించలేనంతగా దిగజారిపోతేనే ప్రమాదం. ఇది మారాలి. మనకోసం జీవితం ధారబోసిన కన్నవారిని వృద్ధాప్యంలో ఆదరించలేని స్థితిలో ఉన్నాం కాబట్టే ఎందరో వృద్ధులు యాచకులుగా మారుతున్నారు. వారి మలిసంధ్య బతుకులు కన్నీటిలో చిధ్రమవుతున్నాయి. దేశంలో నానాటికి వృద్ధుల జనాభా పెరిగి పోతుందని చెప్పే మనమే వారి ఆలనాపాలన గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించలేక పోతున్నాం. వార్ధక్యంలో శరీరం సహకరించక ఎందరో రోడ్డున పడుతున్నారు. వారి అంతిమఘడియలు హృదయాన్ని దహించేలా మారుతున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? బిడ్డలను కని, తమకంటే ఉన్నత స్థానంలో వారిని చూసుకోవాలనుకోవడం ఆ తల్లిదండ్రులు చేస్తున్న తప్పా? ఒక్కక్షణం.. ఒకే ఒక్కక్షణం ఆలోచించండి.

రెక్కలు రాగానే ఎగిరిపోయే పక్షులమా మనం. తన తనువు, మనస్సు కట్టుకున్న వాడికే అర్పించి పుట్టినింటి జ్ఞాపకాలను పక్కనబెట్టి మెట్టి నింటికి వచ్చే స్త్రీకి మనం ఇచ్చే గౌరవమేమిటి? అమ్మకాకుండా ఏ స్త్రీ అత్త కాలేదంటారు. కోడలిపై అత్తల అధికారం, అత్తేకదా అని కోడళ్ల తిరస్కారం, దీనికి తోడు పురుషాధిక్యత, కట్నాల వేధింపులు, అత్యాచార పర్వాలు నానాటికి స్త్రీని సంఘంలో పీడిస్తూనే ఉన్నాయి. ఏమవుతున్నాయి విలువలు?. విలువలకు వలువలు వదిలేస్తున్న స్థితిలో అక్రమ సంబంధాలు. వాటికి ప్రతీకలే చెత్తకుప్పల్లో నేటి బాల్యం. ఎవరికి పుట్టారో, ఎక్కడ ఉన్నారో తెలియని ఆ పసిపిల్లలు సంఘం విసిరేసిన ఎంగిలి మెతుకులు తిని ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో ఆలోచించండి. రేపటి వాళ్ల స్థితి ఏమిటి? బడిలో పలకా బలపం పట్టాల్సిన ఆ చేతులు పలుగు పార పట్టి భావితరాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒకపక్క ఎదుటి మనిషిని కులాలు, మతాల పేరుతో చిన్నచూపు చూడటం, అధికార గర్వంతో అణగదొక్కడం వంటి చర్యలు వికృత రూపు దాలుస్తుంటే మరోపక్క యువత పాశ్చాత్య అలవాట్లకు బానిసలవుతున్నారు. ఎక్కడ… ఎక్కడ చేస్తున్నాం తప్పు.

తనలో తాను ఆత్మపరిశీలన చేసుకోలేనప్పుడు ఎదుటివాడిని మార్చలేం. ఒక్క క్షణం ఆలోచించండి. మీ పిల్లలకు మీరు భారం కాకుండా ఉండాలంటే ముందు మీ తల్లిదండ్రులు మీకు భారం కాకుండా చూసుకోండి. చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు సత్ప్రవర్తన, సభ్యత, సంస్కారం నేర్పించండి. మానవీయ విలువలు వారికి బోధించండి. సమాజంలో మార్పు అనేది సహజం. అది మనిషికి మనిషికి మధ్య అంతరాలు పెంచకుండా చూసుకోండి. అప్పుడే సమాజంలో మనకూ విలువ, మన తరానికీ విలువ.