‘లోక్‌పాల్‌’ పై మీనమేషాలు!

                                ‘లోక్‌పాల్‌’ పై మీనమేషాలు!

Lokpal
Lokpal

వినీతి రహిత భారతావని నిర్మాణమే తమ లక్ష్యం అని చెప్పుకునే పాలక ప్రభుత్వాలు లోక్‌పాల్‌ వ్యవస్థ ఏర్పాటులో అంతులేని తాత్సారం చేస్తున్నాయి. సహజంగానే అవినీతివ్యతిరేక ఉద్యమం అంటే ప్రస్తుతప్రభుత్వాలకు కొంతమేర గిట్టని అంశమే. అయితే నిజాయితీ పౌరులు, హక్కుల సంఘాలు మాత్రం లోక్‌పాల్‌ వ్యవస్థ ఏర్పడితేనే కొంతవరకూ అయినా సామాన్యమధ్యతరగతికి న్యాయం చేకూరుతుందనే యధాశక్తి నమ్మకంతో ఉన్నారు. భారత్‌లో అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మెన్‌ అంటే లోక్‌పాల్‌ ఏర్పాటుకు నాందిపలికింది ఇప్పుడేకాదు. గడచిన యుపిఎ ప్రభుత్వంనుంచే వాస్తవానికి పునాదులు పడ్డాయి. చివరకు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైతేకానీ ఇప్పటి ప్రభుత్వాన్ని సైతం లోక్‌పాల్‌ బిల్లు వైపు కదలించలేకపోయింది. తాజా ఉత్తర్వులనుచూస్తే సుప్రీంకోర్టు పదిరోజుల్లోపు తమ నిర్ణయాన్ని ప్రకటించాలన్న గడువు విధించిందంటే ప్రభుత్వం ఎంతమేర తాత్సారంచేసిందో అవగతం అవుతుంది. లోక్‌పాల్‌ వ్యవస్థ ఏర్పాటుకు చేపట్టిన కార్యాచరణ, అందుకు చర్యలు వివరించాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు పదిరోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఒక స్వఛ్ఛంద సంస్థ కామన్‌కాజ్‌ దాఖలుచేసిన ధిక్కార పిటిషన్‌ను విచారణస్వీకరించిన సుప్రీంకోర్టు ఇప్పటివరకూ లోక్‌పాల్‌ వ్యవస్థను ఎందుకు ఏర్పాటురాదో వివరణ ఇవ్వాలనికోరింది. ఇందుకు సంబంధించి గడచిన ఏప్రిల్‌ 27వ తేదీ స్పష్టంగా తీర్పునిచ్చిందికూడా. గత ఏడాది తీర్పులో సుప్రీంకోర్టు లోక్‌పాల్‌ చట్టం బిల్లులో ప్రతిపక్ష నేతను కూడా సభ్యునిగా నియమించాలన్న వ్యవస్థపైనే అప్పటి పాలక ప్రభుత్వం కావాలనే తాత్సారంచేస్తూ వచ్చింది. గత మేనెల 15వ తేదీ సర్వోన్నతన్యాయస్థానం పదేపదే కేంద్రానికి ఆదేశాలుజారీచేయడంతో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గిని ఎంపిక కమిటీకి జ్యూరీగా నియమించింది.

అవినీతి వ్యతిరేక ఉద్యమానికి భారత్‌లోనిప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే శ్రీకారంచుట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోసైతం ఆయన ఉద్యమాన్ని నిరవధికంగా నిర్వహించారు. అప్పటి ఉద్యమానికి ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌బేడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్‌ జాతీయకన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటివారుసైతం హాజరయ్యారు. తదనంతర పరిణామాల్లో అన్నాహజారే స్వయంగా ఈఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన భారీ ఉద్యమం అవినీతి రహిత వ్యవస్థవైపు సమాజాన్ని ముందుకు నడిపించేందుకు పునాదులు పటిష్టంచేసింది. అంతేకాకుండా ఆదీక్షల్లోనే రైతు సమస్యలపై కూడా అన్నాహజారే నినదించారు. నిరాహారదీక్షలతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కదలిక తెచ్చారనే చెప్పాలి. అయినా అప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిందేకానీ నిర్దిష్టమైన వ్యవధిలోపు ఏర్పాటుచేస్తామని ఎక్కడా చెప్పలేదు. అనుకున్నట్లుగానే వాయిదాలపై వాయిదాలు పడుతూ వచ్చింది. మచ్చలేని ప్రతినిధికోసం అన్వేషిస్తున్నామని ఒకవైపు, మరికొంత వ్యవధి అవసరం అవుతుందని మరోవైపు కేంద్రం ఇలా కుంటిసాకులు చెపుతూనే వచ్చింది. అవినీతి వ్యతిరేక వ్యవస్థఅంటేనే మన ప్రజాప్రతినిధులకు కొంతమేర గిట్టని వ్యవహారం. దేశవ్యాప్తంగాచూస్తే అవినీతి కార్యకలాపాల్లో ఎక్కడచూసినా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యమే ఎక్కువ కనిపిస్తోంది. అవినీతిరహిత సమాజస్థాపనకోసం నేటి అన్నాహజారేతోపాటు ఆనాటి జయప్రకాష్‌ నారాయణ్‌ వంటి నేతలుసైతం నడుంబిగించారు. అయినా ఇప్పటికీ పునాదులను ఎక్కడా ఈ ఉద్యమాలు కదిలించలేకపోయాయి. అవినీతిదే పైచేయిగా ఉంది.

వాస్తవానికి అవినీతి భారత్‌ వ్యవతిరేక ఉద్యమం 2011లోనే అన్నాహజారే ప్రారంభించారు. జన్‌లోక్‌పాల్‌ వ్యవస్థ అవసరమని పెద్ద ఎత్తున నినదించారు. జనలోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా రూపకల్పనకు నాందిపలికింది. మొదటిగా 2ఈ014లో ఢిల్లీ రాష్ట్రప్రభుత్వం అరవింద్‌క్జేఈవాల్‌ ఆధ్వర్యంలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు ఏర్పాటుకు ముందుకువచ్చింది. అయితే శాసనసభలో మాత్రం ప్రవేశపెట్టలేకపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం రద్దయింది. మళ్లీ ఎన్నికల్లో ఆప్‌ప్రభుత్వమే వచ్చింది. వాస్తవానికి ఈ లోక్‌పాల్‌ బిల్లును మొదటి న్యాయవాది శాంతిభూషణ్‌ 1968లో ప్రవేశపెట్టారు. 1949లో ఆనాటి నాల్గవ లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం తెలపాల్సి ఉండగా లోక్‌సభ రద్దుకావడంతో తదనంతరం ఈ బిల్లు మురిగిపోయింది. అప్పటినుంచి 1971లో మళ్లీప్రవేశపెట్టారు. ప్రతిసారి లోక్‌సభలోప్రవేశపెడుతూనే ఉన్నా 2008 వరకూ ఈ బిల్లు ఏనాడూ ఆమోదం పొందలేదు. చివరకు 2012 పార్లమెంటు శీతాకాలసమావేశాల్లో లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభ మాత్రం ఆమోదించలేదు. 2013లో రాజ్యసభలోప్రవేశపెట్టినా చర్చవాయిదాపడింది. చివరకు 2013లోనే లోక్‌సభ,రాజ్యసభలు ఈ బిల్లును ఆమోదించినా ఇప్పటివరకూఈవ్యవస్థ ఏర్పాటుకాలేదంటే పాలక ప్రభుత్వాల రాజక్యీ వ్యూహాల్లో ఈ లోక్‌పాల్‌ వ్యవస్థ చిక్కుకున్నదనే చెప్పాలి. కేవలం లోక్‌పాల్‌ వ్యవస్థ మాత్రమే కాదు ప్రజాహిత కార్యక్రమాలకు నిర్దేశించిన ఈ బిల్లు అయినా ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోనే కదలిక వస్తోంది.

నల్లధన కట్టడికార్యాచరణకుసైతం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం నడిస్తే కానీ ఎక్కడా చలనం కనిపించలేదు. రామ్‌జత్మలానీ వంటి నేతలు ఈకేసులో ప్రభుత్వ చిత్తశుద్ధిని సైతం శంకించారు.ఫలితంగానే సిట్‌ ఏర్పాటయింది. అనుకున్నట్లుగానే స్టాక్‌ మార్కెట్లకు వస్తున్న పెట్టుబడులపై నిఘావేసిన ఈ ప్రత్యేక దర్యాప్తుకమిటీ విదేశాల్లోని గుప్తధనం పై కన్నసి కొంతమేర అయినా రాబట్టింది. ఇకపోతే పన్నుల ఎగవేతరూపంలో జరుగుతున్న అవినీతిని సమూలంగా అరికట్టేందుకుగాను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌, గంగాకళ్యాణ్‌యోజనవంటివి ఉన్నాయి. అయినా ఎక్కడా అవినీతిని నిర్మూలించడం సరికాదు కదా కనీసం కట్టడిచేయలేకపోతున్నారు. స్విస్‌ నేషనల్‌ బ్యాంకు విడుదలచేసిన గణాంకాలను చూస్తే విదేశీ గుప్తధనం మరింతగాపెరిగిందన్నది స్పష్టం అవుతోంది. ఏటికేడాది డిపాజిట్లు పెరుగుతున్నాయంటే అవినీతి రాజ్యమేలుతున్నదనే అర్ధం. పన్నుల ఎగవేత అవినీతిపరిధిలోనికి రానేరాదన్న ఈడిపాజిటర్లపై ఉక్కుపాదం మోపేందుకు లోక్‌పాల్‌వంటి అవినీతి నిరోధక వ్యవస్థ అనివార్యంగా ఏర్పాటుకావాలి. జాబురాస్తేచాలు కదలికతెచ్చే వ్యవస్థ ఉంటే తప్ప భారత్‌లో ప్రస్తుత ప్రబుత్వం చెపుతున్నట్లుగా అవినీతి రహిత భారతావని నిర్మాణం సాధ్యం కాదన్నది జగద్విదితం.

దామెర్ల సాయిబాబా, ఎడిట‌ర్‌, హైద‌రాబాద్‌