లలిత కళల్లో మేటి

DANCE22
keerthi

లలిత కళల్లో మేటి 

నాట్యం కోసం తపించే మనసు ఆమెది. నాట్యమే ఆమె ఊపిరి. కీర్తిప్రతిష్ఠతల కోసం పరుగులు తీసే మనస్తత్వం కాదు. కళకు అంకితమైన జీవితంలోంచి తొంగిచూడలేని, లోతైన పరిశోధన ద్వారా భరతనాట్యంలో ఎన్నో కార్యక్రమాలను ఆవిష్కరించిన ఘనత ఆమెకుంది. నాట్యంలో సాంకేతిక అంశాలను అలవోకగా జోడించి, మనసొంపుగా ప్రదర్శనలు ఇస్తుంటే సంప్రదాయ కళలో ఇంత పరిజ్ఞానం దాగుందా అని అనిపించక తప్పదు. ఆమే కీర్తి రామ్‌గోపాల్‌. భరతనాట్యంలో అటు అకడమిక్‌గా ఇటు ప్రొఫెషనల్‌గా ఏకకాలంలో రాణిస్తున్నారు. చిన్నవయసులోనే భరతనాట్యంపై మక్కువ ఉన్న ఆమె అఆఇఈలతో పాటు బుడిబుడి అడుగులతో తకిటతకిటను కూడా నేర్చుకున్నారు. ఆమె నృత్యాన్ని ప్రసిద్ధ భరతనాట్య గురువులైన పద్మినీ రామచంద్రన్‌, లక్ష్మణ్‌ వంటి కళాకారుల వద్ద నేర్చుకున్నారు. అంతేకాదు ప్రియదర్శిని గోవింద్‌, పులకేశ్‌ కస్తూరి, నందకుమార్‌, ఉన్ని కష్ణణ్‌ వంటి కళాకారుల వద్ద సంగీతం, నాట్యం అభ్యసించారు. అంతేకాక హర్షసమంగ వద్ద మృందంగం, నటరాజ్‌మూర్తి వద్ద వయొలిన్‌ కళను నేర్చుకున్నారు.

కీర్తి ప్రదర్శనల్లో భక్తిపారవశ్యంతో పాటు ప్రేమ, అభిమానం, మనసు లోతుల్లోకి చొచ్చుకునిపోయే అభినయం ఆమె సొంతం. ఎక్కడ భరతనాట్య మహోత్సవాలు జరుగు తున్నా తప్పనిసరిగా ఆమె ప్రదర్శన ఉండి తీరాల్సిందే. కర్ణాటక నిత్యకళాపరిషత్‌, ఇంటర్నే షనల్‌ డాన్స్‌ అలియన్స్‌, మద్రాసు తెలుగు అకాడమి, గోవా కళా అకాడమి, స్వర్ణ నిత్య ప్రతిభ, భరత్‌ కళాచార్‌, అంకురా ఫెస్టివల్‌, దసరామహోత్సవ, స్పిరిట్‌ ఆఫ్‌ యూత్‌ ఫెస్టివల్‌, మ్యూజిక్‌ అకాడమీ, ఇండియన్‌ ఫైనార్ట్స్‌ సొసైటీ, నాట్యాంజలి ఫెస్టివల్‌ ఇలా ఎలాంటి ఉత్సవాలైనా కీర్తీరామ్‌గోపాల్‌ ప్రదర్శన తప్పనిసరిగా ఉండేది. ఆమె ప్రదర్శన ఉందంటే చాలు ప్రేక్షకులు అమితాసక్తితో వస్తారు. కీర్తికి ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన నృత్యం ‘వర్ణం. ఇది ఆమె స్వయంగా రూపొందించి, ఇచ్చిన ప్రదర్శన. ఆమెకు శివుడు అంటే అమితమైన ప్రేమ, భక్తి. అందుకే తన నాట్యంలో అణువణువునా ఆయనపై అల్లుకున్న ప్రేమ, అభి మానం, ఆకాంక్షలను అభి నయం ద్వారా వ్యక్తం చేస్తుంటారు.

ప్రేక్షకులను మైమరిపించేందుకు కారణం కూడా ఇదే. లయబద్దంగా, అడుగులో అడుగు వేస్తూ, విరహవేదనను అభివ్యక్తం చేస్తూ, నాట్యం చేస్తూ, చూపరుల మనసు దోచుకోవడం ఆమెకు బాగా తెలిసిన విద్య. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయేలా ఆమె ప్రదర్శన ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు ఆ కళలో ఆమె ఎంతగా పాతుకునిపోయారో. సంగీతంలోను ఆమెదే పైచేయి కీర్తిరామ్‌గోపాల్‌ భరతనాట్యంకే పరిమితం కాలేదు. ఆమె వయొలిన్‌, వొకల్‌, మృందంగం వంటి బహుముఖ కళల్లో ఆరితేరారు. ఒకవైపు భరతనాట్యం కళా ప్రదర్శనలు ఇస్తూనే, మరొక వైపు సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తెలుగులోను సేవలు కీర్తిరామ్‌గోపాల్‌ స్వస్థలం బెంగళూరు అయినా తెలుగులో కూడా ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చారు.

ఇటీవలేే తెలుగులో ఆమె రూపొందించిన ‘జవళీ భరతనాట్యం ఎంతో పాపులర్‌ అయ్యింది. మనరాష్ట్రంలో కూడా ఆమె ఇస్తున్న ప్రదర్శనలు కళాభిమానులను అబ్బురపరచడమే కాక, ‘ఔరా! అనిపించింది. కీర్తిరామ్‌గోపాల్‌ కేంద్ర ప్రభుత్వం ద్వారా బెస్ట్‌ భరతనాట్య అవార్డును పొందారు. దసరా ఉత్సవాల్లో ఇచ్చిన ప్రదర్శనలకుగాను యువ ప్రతిభ అవార్డును, మద్రాసు ప్రభుత్వం ద్వారా పొందిన అవార్డు వంటి ఎన్నింటినో పొందారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు ఇచ్చే నేషనల్‌ స్కాలర్‌షిప్‌ అవార్డును కూడా పొందారు. పుస్తకాలు కీర్తిరామ్‌గోపాల్‌ భరతనాట్యంకు సంబంధించిన కొన్ని పుస్తకాలను కూడా రాశారు. నాట్య కళాశాలల్లో బోధకురాలిగా కూడా పనిచేస్తు న్నారు. విదేశాల్లో ప్రదర్శనలు కెనడా, టొరొంటో, బ్రిటన్‌ వంటి దేశాల్లో సైతం కీర్తిరామ్‌గోపాల్‌ ప్రదర్శనలు ఇచ్చారు. టీవీలో కూడా తరచుగా ప్రదర్శనలు ఇస్తుం టారు. రానున్న కాలంలో భరతనాట్యంకు మరింతగా సేవ చేసి, అనేకులను నాట్యకళాకారులుగా తీర్చిదిద్దడమే తన జీవితధ్యేయంగా భావిస్తున్న కీర్తి ఆశయాలు ఫలించాలని మనమూ ఆశిద్దాం…