రహదారుల దిగ్బంధం జనసేన మద్ధతు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం రేపు జాతీయ రహదారుల దిగ్బంధానికి ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. తాము రేపు ఏపీ వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శనలో పాల్గొంటామని తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తక్షణమే విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైసీపీ రేపటి ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. ఈ విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టకుండా కుట్రలు పన్నుతోందని అన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని వామపక్ష నేతలు తెలిపారు.