రోడ్డు, జ‌ల‌, వాయు మార్గాల అనుసంధానానికి ఓకేరోజు శంఖుస్థాప‌న‌

Venkaiah naidu
Venkaiah naidu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి తన తోడ్పాటు అన్ని విదాలుగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ….తానిప్పుడు ప్రభుత్వంలో లేననీ, అలాగే రాజకీయాలలో కూడా లేననీ అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగే విషయంలో తన తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందన్నారు. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించానని వెంకయ్య అన్నారు.
నితిన్ గ‌డ్కారి 3 ఇన్ 1 మంత్రి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి 3 ఇన్ 1 మంత్రి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు, జల రవాణా, నదుల అనుసంధానం, ప్రాజెక్టులకు సంబంధించి మూడు శాఖలకూ ఆయనే మంత్రి అని వెంకయ్య చెప్పారు. అందుకే ఆయనను 3 ఇన్ వన్ మంత్రి అనాలన్నారు. ఈ రోజు ఇక్కడ జల రవాణా మార్గం శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రారంభం కార్యక్రమాలు చాలా సంతోషకరమని వెంకయ్య అన్నారు. రాజధానికి అన్ని వైపుల నుంచీ అనుసంధానం ఈ రోజు జరిగిన కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. రోడ్డు, జల, వాయు మార్గాలు అమరావతి అనుసంధానం కావడం చాలా గొప్ప విషయమని, ఈ మూడూ ఒకే రోజు శంకుస్థాపన కార్యక్రమం జరుపుకోవడం గొప్ప విషయమన్నారు.
మాతృభాష త‌ప్ప‌నిస‌రి
మాతృభాషను అందరూ నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషను తప్పని సరిగా నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఏపీలో ఉద్యోగం కావాలంటే తెలుగు భాష వచ్చి ఉండాలని నిబంధన విధించాలని ఆయన సీఎం చంద్రబాబుకు సూచించారు. పరభాషా ద్వేషం ఉండకూడదని అదే సమయంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఇంగ్లీషు నేర్చుకోకుంటే మా పిల్లలు ఏమౌతారో అన్న ఆందోళన తల్లిదండ్రులలో అవసరం లేదన్నారు. తాను వీధి బడిలో చదువుకున్నానని చెప్పిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు కూడా ఇంగ్లీషు మీడియంలో చదువుకోలేదనీ, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, తాను దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాననీ వెంకయ్య చెప్పారు. ప్రధాని మోడీ కూడా ఇంగ్లీషుమీడియంలో చదువుకోలేదన్నారు
న‌దుల అనుసంధానానికి చంద్ర‌బాబే ఆద్యుడు
నదుల అనుసంధానానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆద్యుడు చంద్రబాబు అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ..మనకు జీవదాతలైన నదులను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కృష్ణా డెల్టా కృష్ణా నదిలో నీరు లేక ఎండిపోయే పరిస్థితి వస్తే పచ్చదనాన్ని కాపాడటానికి చంద్రబాబు కృష్ణ లోనికి గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా మళ్లించి కృష్ణా డెల్టాకు నీరందించారని వెంకయ్య చెప్పారు. నదుల అనుసంధానాన్ని ఆచరణలో చేసిన చూపిన చంద్రబాబును సభాముఖంగా అభినందిస్తున్నానని వెంకయ్య‌నాయుడు అన్నారు.