రైల్వేలో 2.30 లక్షల ఉద్యోగాలు

train
train

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో రైల్వేలో 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. తొలిదశలో 1.31 లక్షల పోస్టులను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామనీ, ఇప్పుడు దానికి అదనంగా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని చెప్పారు. ఇందులో 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం పేదలకు 10% కోటా కల్పిస్తామనీ, తద్వారా 23 వేల మంది పేదలు లబ్ధి పొందుతారన్నారు. ఈ పోస్టులకు స్థాయిని బట్టి ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్‌ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని మంత్రి  పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు.