రైతు రథాలు పంచేసుకొన్నారు!

nlr
Tractor

రైతు రథాలు పంచేసుకొన్నారు!

మంజూరైన ట్రాక్టర్లు నేతల చేతుల్లోకి!

వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తెచ్చి పేద రైతులకు సాగు ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ీరైతు రధం పథకం రాబంధుల నోట చిక్కి విలవిల్లాడుతోంది. మంజూరైన ట్రాక్టర్లను ప్రభుత్వం విధించిన నిబంధనలు తుంగలోతొక్కి నాయకులు ఇష్టారాజ్యంగా పంచు కొంటున్నారు. రైతులు మీ-సేవలో పేర్లు నమోదు చేసుకొంటే ప్రాధన్యాతను బట్టి వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేసి ీఅందరి ఆమోదంతో రైతు రధాలు మంజూరుకు పంపాల్సి ఉంటుంది. అయితే అధికార పార్టీ నాయకులు తలా ఒకటి పంచేసుకొని వాటినే మంజూరు కోసం పంపుతూ సామాన్య రైతులకు మొండి చేయి చూపుతున్నారు. సామాన్య రైతులు వచ్చి వ్యవసాయశాఖ అధికారులను అడిగినా మీ దరఖాస్తులు వారి వద్ద మొదట సంతకం తీసుకొన్న తర్వాత మీ-సేవలో చేసుకోండి అంటూ ఉచిత సలహా మాత్రం ఇచ్చి లేదంటే మీ ఇష్టం చేసుకొన్నా ఇబ్బంది లేదంటూ సన్నాయి నొక్కులు కొక్కడంతో దాదాపుగా రైతులు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.

రైతు రధాల కోసం ఇతర రైతుల సంగతి అటుంచి అధికార పార్టీ నాయకుల్లోనే సఖ్యత లేదని ఇందులోనూ ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లు వలసలకే ఇచ్చారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని చిల్లకూరుకు 12, కోట 10, మంత్రి కోటా కింద మరో పది, గూడూరు 12, చిట్టమూరు 12, వాకాడు 12 మొత్తం 68 రైతు రధాలు మంజూరు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్‌ను ఎంపిక చేసుకొంటే వాటిని మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలు ట్రాక్టర్‌కు మరో 50 వేల రూపాయలు రోటావేటర్‌కు ఇస్తుంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒక కంపెనీ యజమానితో కుమ్మక్కై ఆ ట్రాక్టర్లనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నట్లు తెల్సింది. వ్యవసాయాధికారులకు ఆ ప్రజా ప్రతినిధులు సూచించడంతో రైతులకు వారు ఖచ్చితంగా అవి కొనాల్సిందేనని పేర్కొంటున్నట్లు తెల్సింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ీనాడా దొరికిందని గుర్రం కొన్నట్లు మార్కెట్‌ ధర కన్నా దాదాపు 70 వేల రూపాయల వరకు ఎక్కువ చెపుతున్న రైతు రధాలు తీసుకొని అప్పుల పాలు కావడం తప్ప బాగు పడేది లేదని పేర్కొంటున్నారు. దాదాపుగా ఏ ట్రాక్టరు అయినా 5.5 లక్షల రూపాయల వరకు ఉంటుందని కానీ ఇక్కడ ఎక్కువ చెపుతున్న మొత్తం ట్రాక్టర్‌ కంపెనీలు, ప్రజా ప్రతినిధుల్లో ఎవరి జేబులోకి పోతుందో తెలియాల్సి ఉంది. ఇలా కట్టిపెట్టే ప్రయత్నాల్లోనే కోట మండలంలోని రైతులు మంత్రి దృష్టికి ఇక్కడ జరుగుతున్న కుమ్మక్కు వ్యవహారాన్ని తీసుకు పోవడంతో వ్యసాయాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెల్సింది. రైతులు ఏ ట్రాక్టర్‌ కోరితే ఆ ట్రాక్టర్‌ుకు ప్రతిపాధనలు పంపాలని ఆదేశించినట్లు తెల్సింది.

దీంతో కిమ్మనకుండా బతుకు జీవుడా అని ఇక్కడ జరిగిన తంతును బయటకు చెప్పకనే ప్రభుత్వ నిబందనల ప్రకారం తీసుకోవచ్చంటూ ఇపుడు వ్యవసాయధికారులు పేర్కొంటున్నట్లు తెల్సింది. కంపెనీల ప్రతినిధులు కూడా ఇక్కడ జరుగుతున్న తంతును ప్రభుత్వ స్థాయి పెద్దలకు చేర వేస్తున్నట్లు తెల్సింది. పలు రకాల ట్రాక్టర్‌ కంపెనీలు ఉన్నాయని ఇలా కొన్నింటికే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని రైతులకు తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించే ఇతర పరిశ్రమల ట్రాక్టర్లు కూడా పంపిణీకి ఉంచితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రాయతీతో రైతు ఇష్టానుసారం కావల్సిన ట్రాక్టర్‌ను కొనుగోలు చేసుకొనే విధంగా ప్రభుత్వం కల్పించిన వెలసులుబాటు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది.