రైతుల ఉద్యమంపై స్పందించిన విజయశాంతి

హైదరాబాద్‌: బిజెపి నాయకురాలు విజయశాంతి రైతుల ఉద్యమంపై స్పందించారు. రిపబ్లిక్ డే సంఘటనల వరకూ రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తూనే వచ్చిందన్నారు. ఇరు పక్షాలూ ఎంతో సంయమనంతో వ్యవహరించాయన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి కూడా చర్చలకు ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని సానుకూల దృక్పథంతో ముందుకు వస్తే… రైతు సంఘాల నాయకులు మాత్రం వెనక్కి తగ్గుతారా లేదా గద్దె దిగుతారా? అంటూ రాజకీయ శత్రువుల తీరుగా మాట్లాడటం శోచనీయమన్నారు.

ఇవి వారి మాటలా? లేదా వెనుక నుంచి ప్రేరేపిత విరోధులు అనిపిస్తున్నారా? అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. అయినా, ఒకటిన్నర సంవత్సరాల పాటు అమలు కాని, అమలుకు రాని చట్టాలపై ఇప్పుడెందుకు ఇంత యాగీ పెట్టి ఆగం చేస్తున్నారు? ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో చర్చలకు సిద్ధంగా ఉండగా… ఎందుకు ఈ ధోరణి ఎంచుకున్నట్లు? ఇలాంటి ప్రకటనల వల్ల సమస్య మరింత జఠిలమవుతూ వస్తుందే కానీ, పరిష్కారానికి దోహదపడటం లేదని రైతు సంఘాల నేతలు అర్థం చేసుకోవాలన్ని విజయశాంతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.