రైతులకు అందని ఫసల్‌బీమా యోజన

Narendra Mody
Narendra Mody

బెంగళూరు: కర్నాటకలో రైతు ప్రయోజనాలు నెరవేర్చే ప్రభుత్వం ఏర్పాటుకావాల్సిన అవసరంఎంతో ఉందని, కర్నాటకలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని సిద్దరామయ్య ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన అమలులో తీవ్ర నిర్లక్ష్యంచూపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరేంద్రమోడీ యాప్‌ద్వారా బిజెపి కిసాన్‌మోర్చా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయం, రైతుల సంక్షేమం రెండూ ఎప్పుడూ బిజెపిప్రాధాన్యతలని వివరించారు. బిజెపి కిసాన్‌మోర్చా కార్యకర్తలు ఇందుకు సంబంధించి రైతులను చైతన్యపరిచి వారి సమస్యలను పట్టించుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అవగాహనపెంపొందించాలని కోరారు. బీమాయోజనపై కర్నాటకనుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, నలుగురు ఎంపిల్లో ఒకరు తన నియోజకవర్గంలో గొప్పగా కృషిచేసారని, కిసాన్‌మోర్చా కార్యకర్తలతో కలిసి ఫసల్‌బీమా యోజన అమలుకు చర్యలు చేపట్టారన్నారు. అయితే కర్నాటక ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని,రైతు ప్రయోజనాలు ఆప్రభుత్వానికి అవసరం లేదని, ప్రధానమంత్రి ఫసల్‌బీమా ప్రయోజనాలు నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తే రైతులకు మేలుజరిగేదన్నారు. కిసాన్‌మోర్చా కార్యకర్తల పాత్ర ఈ ఎన్నికల్లో కీలకమని అన్నారు. రైతులకు చేరువ అయ్యేందుకు ఇదేమంచి అవకాశంగా వెల్లడించారు. కిసాన్‌ కార్యకర్తలే రైతుకు ధీమా ఇస్తారని రైతులప్రయోజనాలు సంక్షేమంకోసం పాటుపడే ప్రభుత్వం కర్నాటకలో అత్యవసరమని మోడీ వెల్లడించారు. కిసాన్‌మోర్చా కార్యకర్తలు రైతుల సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలోఉంచుకోవాలన్నారు. వ్యవసాయం, రైతులు రెండూ తమకు అత్యంత ప్రాధాన్యతలని తమ వార్షికబడ్జెట్‌నుసైతం మీడియా సంస్థలు రైతుబడ్జెట్‌గాను, గ్రామీణ సంక్షేమ బడ్జెట్‌గా అభివర్ణించిన అంశాన్ని గుర్తుచేసారు.