రేపు మరోసారి బ్యాంకు ఉద్యోగుల సమ్మె

SBI-
SBI-

ఖాతాదారులు సహకరించాలని విజ్ఞప్తి
హైదరాబాద్‌: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రధానంగా వేతన సవరణ, బ్యాంకుల విలీనం, పెన్షన్ల పెంపు డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు.. ఇందులో భాగంగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ ఈనెల 26వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 21వ తేదీన ఒక రోజు సమ్మె చేసినా దీనిపై ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి ఒక రోజు సమ్మెకు దిగుతున్నారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు ఉద్యోగుల, నాలుగు అధికారుల సంఘాల సంయుక్త వేదిక అయిన యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ గౌరవ ప్రదమైన వేతన సవరణ త్వరితగతిన అమలు చేయాలని, అధికారులకు వేతన సవరణలో పాక్షిక ఆదేశాలను (స్కేల్‌-3 వరకూ) నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ 2017 నవంబర్‌ 1వ తేదీ నుండి జరపాల్సి ఉన్నా దానిపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు శూన్యమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకింగ్‌ రంగ ఉద్యోగులందరికీ వేతన సవరణను జరపాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ఇండియన్‌ బ్యాక్స్‌ అసోసియేషన్‌కు 2016 జనవరి నెల నుండి పలుమార్లు ఆదేశించింది. యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తన కామన్‌ చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను నిర్ణీత సమయం కంటే ముందే సమర్పించినా, ఇప్పటికే 12 దఫాలుగా చర్చలు జరిపినా ఇంకా బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే ఉంది. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమం తప్పకుండా నికర లాభం సంపాదిస్తున్నా, లాభాల్లో వస్తున్న తరుగుదలను సాకుగా చూపి ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ 2 శాతం వేతన పెరుగుదలను మాత్రమే చేయగలమని ప్రతిపాదించడంతో ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవం ఏమంటే బ్యాంకు లాభాల్లో 70 శాతం నిరర్థకర ఆస్తులను, మొండి బకాయిలను కేటాయించడమే ప్రస్తుత బ్యాంకుల లాభాలపై వత్తిడికి మూల కారణమని చెబుతున్నాయి. గడచిన వేతన ఒప్పందం వరకూ, స్కేల్‌-7 అధికారుల వేతన సవరణ ఒప్పందంలో చర్చలు జరిగేవని కానీ, ఈ వేతన ఒప్పందంలో ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌, కొన్ని సభ్యుత బ్యాంకులు స్కేల్‌-3 అధికారుల వరకే వేతన సవరణ ఒప్పందంలో భాగస్వామ్యం చేయాలని కోరి తన అశక్తతను చాటు కుందని వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌, ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ యొక్క అసంబద్ధమైన 2 శాతం వేతన సవరణ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చి న్యాయబద్దమైన వేతన సవరణను డిమాండ్‌ చేస్తోంది. 1979వ సంవత్సరం నంఉడి అమలవుతున్న విధంగా అందరు అధికారులను స్కేల్‌-7 వరకూ ఈ వేతన సవరణ ఒప్పందంలో భాగం చేయాలని యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ డిమాండ్‌ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ వేతన సవరణ ఒప్పందాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేస్తోంది. కానీ దురదృష్టవశాత్తూ ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ ఈ డిమాండ్లను అంగీకరించకపోవడంతో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తప్పని సరి పరిస్థితుల్లో సమ్మె పిలుపునకు ఇవ్వక తప్పలేదని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రల ప్రధాన కార్యదర్శి జి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. కాగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణను త్వరితగతిన చేపట్టాలని తొలి రోజుల్లో చేసిన ప్రయత్నాలను ప్రస్తుతం చేయడం లేదని చెప్పారు. ఎన్నో కష్టనష్టాలకు గురైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అహోరాత్రులు శ్రమిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, అధికారుల జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగుల జీతభత్యాలతో పోలిస్తే చాలా తక్కువ అన్నది కఠోర వాస్తవమన్నారు. ఎంతో న్యాయ సమ్మతమైన వేతన సవరణ ఒప్పందం విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడమే కాకుండా, దాన్ని నిరాకరిస్తున్నట్లు ఆయన వివరించారు. యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, సమ్మె లేకుండా చూడాలని ఎంత ప్రయత్నించినా అనివార్య పరిస్థితుల్లో సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా సమ్మె తలపెట్టినట్లు తెలియచేశారు. ఖాతాదారులు అందరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్ధం చేసుకుని డిమాండ్ల సాధనలో తమతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.