రేపు త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు

Tripura Assembly Elections
Tripura Assembly Elections

అగర్తాల: త్రిపుర శాసనసభ ఎన్నికలు రేపు జరగనున్నాయి. గత 25 సంవత్సరాలుగా లెఫ్ట్ పార్టీలు త్రిపురలో అధికారంలో ఉన్నాయి. ఈ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 60 సీట్లకు గాను 59 సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. ఐదు రోజుల క్రితం చారీలాం నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి రామేంద్ర నారాయణ మృతి చెందడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. చారీలాం నియోజకవర్గానికి మార్చ్ 12న ఎన్నిక నిర్వహించనున్నారు. బీజేపీ పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నిక ప్రచారం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరాని, ఉత్తరప్రదేశ్ అదిత్యానాథ్ నియోజకవర్గాల్లో తిరుగుతు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  పాతికేళ్ల నుంచి అధికారంలో ఉన్న వామ‌న‌క్ష‌ పార్టీ 50 ర్యాలీలు నిర్వహించింది. రాష్ర్టానికి నాలుగు ప‌ర్యాయాలు  ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్, ఆ పార్టీ జాతీయ నాయకులు సీతారం ఏచూరి, బృందా కారత్‌లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.