రేపు టిడిపి ధ‌ర్మ పోరాట స‌భ‌

TDP
TDP

తిరుపతి: రాష్ట్రానికి న్యాయం చేస్తామంటూ  హామీ ఇచ్చిన నరేంద్రమోదీ వాగ్ధాన భంగానికి పాల్పడ్డారంటూ తెలుగుదేశం ధర్మపోరాటం పేరుతో తిరునగరిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆదుకుంటామని ప్రకటించిన తిరుపతి వేదికగానే నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాల పేరిట సభ జరగనుంది. లక్షలాదిమంది సాక్షిగా మోదీ తీరును ఎండగట్టనుంది. సోమవారం మధ్యాహ్నం తిరుమల స్వామివారి దర్శనాంతరం ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్నారు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా నిరసన గళం. విభజన సమయంలో జరిగిన అన్యాయంపై ఆక్రోశం. ఇప్పుడు విభజన తర్వాత న్యాయం జరగలేదంటూ ఆగ్రహం. అప్పుడు తల్లీ, పిల్ల కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలంటూ ప్రజా గర్జనలు. ఇప్పుడు భాజపా, వైకాపా, జనసేన కుమ్మక్కు రాజకీయాలంటూ ధర్మపోరాట సభలు.. అప్పుడు, ఇప్పుడు తెదేపా పోరాటానికి నాందిగా నిలుస్తోంది వెంకన్న పాదాల చెంతనున్న తిరుపతే. 13 జిల్లాల్లో నెలకి కనీసం ఒక సభ చొప్పున ధర్మపోరాటసభలు నిర్వహించాలని నిర్ణయించగా తొలిసభను తిరుపతిని వేదికగా చేసుకున్నారు.