రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు జమ

రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. గత కొద్దీ రోజులుగా రైతు బంధు నిధుల కోసం యావత్ రైతులు ఎదురుచూస్తున్నారు. మరోపక్క విపక్షాలు సైతం నిధులు ఇంకా వేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ రైతుల నిధులు జమ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.

యాసంగికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం రేపు బుధవారం నుంచి రైతులకు అందనున్నది. ఉదయం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానున్నాయి. ఈ సీజన్‌లో సుమారు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7,600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. రైతుబంధుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా చివరి రైతు వరకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు.

ఎప్పటిలాగే రైతుల భూ విస్తీర్ణం ప్రకారం (ఎకరాల వారీగా) వరుస క్రమంలో వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించాడు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.