రెడ్డీస్‌కు ముందుంది మంచికాలమే!

Dr.Reddy's Lab
Dr.Reddy’s Lab

న్యూఢిల్లీ: ఫార్మా రంగంలో అతి తక్కువ కాలంలోనే వేగంగా ఎదిగింది. హైదరాబాదీ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌. అయితే గత రెండేళ్లుగా తమ యూనిట్లకు యుఎస్‌ఎఫ్‌డిఎ నుంచి ఫామ్‌ 483 జారీ కావడంతో కాస్త ఇబ్బందులు పడింది. అయితే చక్కని ప్రణాళికలను ఆచరణలో పెట్టడం, వ్యూహాత్మక అడుగులతో కంపెనీ ఈ సమస్యలన్నింటినీ అతి తక్కువ కాలంలోనే పరిష్కరించుకుని మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఎఫ్‌డిఎ తనిఖీలు, ధరలు తగ్గడంతో కొత్త ఔషధాలను గత కొంతకాలంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టలేకపోయిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఈ ఆర్థికసంవత్సరంలో ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగుతోంది. జిఎంపి నిబంధనలకు అనుగుణంగా తయారీ ప్రక్రియ లేదంటూ 2015 నవంబర్‌లో మిర్యాల గూడలోని యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రాడియెంట్స్‌, ఎపిఐ ప్లాంటు, వైజాగ్‌ దువ్వాడలోని క్యాన్సర్‌ ఫార్ములేషన్ల ప్లాంటు, శ్రీకాకుళంలోని యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డిఏ నుంచి హెచ్చరిక లేఖలను డాక్టర్‌ రెడ్డీస్‌ అందుకుంది. అప్పటి నుంచి అమెరికా నియంత్రణ సంస్థ అనుమతులు పొందడానికి, నిబంధనలకు అనుగుణంగా యూనిట్లను తీర్చిదిద్ది తమ లోపాలను సవరించుకుంది. గత కొద్ది త్రైమాసికాలుగా నిబంధనలకు అనుగుణంగా యూనిట్లను తీర్చిదిద్దడమే ప్రాధాన్యమని ప్రకటించిన ఈ కంపెనీ, ఈ నెల మిర్యాలగూడలోని ప్లాంటుకు ఇఐఆర్‌ రావడం కొత్త ఔషధాల ఉత్పత్తికి మార్గం సుగమం చేసింది. ఈ ప్లాంటులో సొంత వినియోగానికి, ఖాతాదారు కంపెనీల కోసం ముడి ఔషధాలను డాక్టర్‌ రెడ్డీస్‌ తయారుచేస్తోంది. యూఎస్‌లో డాక్టర్‌రెడ్డీస్‌ చేసే ఔషధ విక్రయాల్లో 50శాతానికి పైగా హైదారబాద్‌లోని బాచుపల్లి ఫార్ములేషన్ల ప్లాంటులో తయారవుతున్నాయి. 2017, ఏప్రిల్‌లో ఈ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డిఎ 483 ఫారమ్‌ జారీచేసింది. దీనికి కూడా హెచ్చరిక లేఖ జారీ కావచ్చన్న భయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అయితే గత ఏడాది చివర్లో ఈ ప్లాంటుకు యూఎస్‌ఎఫ్‌డిఎ గ్రీన్‌సిగ్నల్‌ పడింది. దీంతో ఈ పరిణామాలన్నీ కంపెనీపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇక నియంత్రణపరమైన ఇబ్బందులు తొలగిపోతుండడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10నుంచి 15వరకు కొత్త ఔషధాలను అమెరికాలోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తుండడంతో మార్కెట్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గత 10 ట్రేడింగ్‌ సెషన్లలో ఈ స్టాక్‌ దాదాపు 18 శాతం లాభపడింది. పరిస్థితులు కంపెనీకి అనుకూలంగా మారుతున్నాయని, షేరు ధర మరింత పెరగడానికి అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ పోటీని తట్టుకోవడానికి క్లిష్టమైన, అందరికి ప్రవేశం సాధ్యంకాని ఔషధాలపై దృష్టిపెట్టాలని డాక్టర్‌ రెడ్డీస్‌ భావిస్తోంది. పెయిన్‌ కిల్లర్‌గా వినియోగించే సుబాక్సాన్‌ కూడా త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. మల్టీపుల్‌ స్ల్కెరోసిన్‌ చికిత్సకు వినియోగించే కోపాగ్జాన్‌ జనరిక్‌ను యూఎస్‌లో లాంచ్‌చేయాలని యోచిస్తోంది. కంపెనీ తయారు చేసే 40 ఎంజి మోతాదులోని కోపాగ్జాన్‌ జనరిక్‌ ట్యాబ్లెట్స్‌కు యూఎస్‌ఎఫ్‌డిఎ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే కంపెనీ లాభాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే మూడేళ్లలో నార్త్‌ కొరియా నుంచి వచ్చే రెవిన్యూలో 50 శాతానికిపైగా ఇంజెక్షన్లు, టాపికల్స్‌, కాంప్లెక్స్‌ డోసేజీ ఔషధాల నుంచి రావాలనే లక్ష్యంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఉంది. ఇక ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ ఆదాయం రూ.14,196 కోట్ల నుంచి రూ.14,281 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో నికరలాభం రూ.1292 కోట్ల నుంచి రూ.947 కోట్లకు తగ్గింది. విక్రయాల విషయానికి వస్తే మే నెలకుగాను 12.9 శాతం వృద్ధితో రూ.235 కోట్లకు చేరాయి.