రెండు జట్లకు చావో రేవో

KOHLI, DUMINI-1
KOHLI, DUMINI

రెండు జట్లకు చావో రేవో

సఫారీ గడ్డపై కోహ్లీసేన పర్యటన తుది దశకు చేరుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో చివరిదైన ఆఖరి టీ20తో సఫారీ గడ్డపై తన పర్యటనను ముగించనుంది. ఈ టోర్నీ విజేత ఎవరో తేల్చే మ్యాచ్‌ ఆఖరి మ్యాచ్‌ కావడంతో సిరీస్‌ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే కోహ్లీసేన దక్షిణాఫ్రికా గడ్డపై రెండు సిరీస్‌ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. స్వదేశంలో వరుస విజయాలను నమోదు చేసి భారీ అంచనాల మధ్య సఫారీ గడ్డపై భారత జట్టు గతేడాది డిసెంబర్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ొలుత జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను నెగ్గి సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అంతా భావించాలి.అయితే, అభిమానుల అంచనాలను అందుకోవడంలో కోహ్లీసేన విఫలమైంది. తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలై మూడో టెస్టులో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది. చివరి టెస్టులో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో ఆరు వన్డేల సిరీస్‌ను ఏకంగా 5-1తో చేజిక్కించుకుని సఫారీగడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, శనివారం మూడో టీ20లో కూడా గెలిచి సఫారీ గడ్డపై విజయంతో ముగించాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతుండగా…వన్డే సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి టీ20 సిరీస్‌లో బదులు తీర్చుకోవాలని ఆతిథ్య దక్షిణాఫ్రికా వ్యూహం రచిస్తోంది. అంతేకాదు సొంతగడ్డపై విజయంతో సిరీస్‌ని ముగించాలని ఆశిస్తోంది.

దీంతో ఇక చావో రేవో సమయం వచ్చేసింది. శనివారమే భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య చివరి టీ20 పోరు. సిరీస్‌ 1-1తో సమం కావడంతో కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో మ్యాచ్‌ నిర్ణయాత్మకంగా మారింది. రెండో టీ20లో హెన్రిచ్‌ క్లాసెన్‌, జెపి డుమిని ఆతిథ్య జట్టుకు విజయం అందించి సిరీస్‌ను రసవత్తరంగా మార్చేశారు. తాము ప్రత్యర్థి జట్టు నుంచి ఇలాంటి పోటీనే కోరుకుంటు న్నామని కోహ్లీ అన్నాడు.

ఈ నేపథ్యంలో చివరి పోరులో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడే అవకాశాలున్నాయి. మొత్తంగా అభిమా నులు పరుగుల పండగ చూడబోతున్నట్టే అనిపి స్తోంది. మ్యాచ్‌ గెలిస్తే కోహ్లీసేన దక్షిణాఫ్రికా గడ్డపై రెండు సిరీస్‌ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. భారత బౌలర్లపైనే భారం…. టీమిండియా బ్యాటింగ్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మను మినహాయిస్తే టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ బాగానే ఉంది. ధావన్‌, కోహ్లీ, మనీశ్‌ పాండే, ధోని, రైనా చక్కని ఫామ్‌ కనబరిచారు.

రెండో టీ20లో 170 పరుగులు చేస్తే ఎక్కడ అనుకున్న సమయంలో పాండే, ధోని వీరోచితంగా ఆడి 189 పరుగుల లక్ష్యం నిర్ధేశించారు. అయితే రెండో టీ20కి ముందు వరకు దుర్భేద్యంగా కనిపించని యజువేంద్ర చాహల్‌ బౌలింగ్‌ క్లాసెన్‌ దెబ్బకు ప్రశ్నార్థకంగా మారింది.

రెండు టీ20ల్లో అతడు 1 వికెట్‌ తీసి 12.87 ఎకానమీతో 103 పరుగులిచ్చాడు. మరోసారి క్లాసెన్‌ అతడి బౌలింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా రోజులుగా టీమిండియా పొట్టి క్రికెట్‌లో ఒక లెఫ్టార్మ్‌ పేసర్‌ను ఆడిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో జయదేవ్‌ ఉన్కదత్‌ ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యాడు. 9.78 ఎకానమీతో 75 పరుగులిచ్చి 2 వికెట్లు మాత్రమే తీశాడు. గాయం కారణంగా రెండో మ్యాచ్‌ ఆడని బుమ్రా మూడో టీ20కి ఆడేది అనుమానమే. అతడు ఫిట్‌గా ఉంటే మాత్రం జయదేవ్‌ జట్టు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. శార్ధూల్‌ ఠాకూర్‌ తెలివిగా బౌలింగ్‌ వేసి సెంచూరియన్‌లో నాలుగు ఓవర్లకు 1/31తో నిలిచాడు.

ఇక భువనేశ్వర్‌ సంగతి చెప్పన క్కర్లేదు. మూడో పేసర్‌గా హార్థిక్‌ పాండ్యాను భావిస్తే అక్షర్‌ పటేల్‌కు అవకాశం రాకపోవచ్చు. గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉన్న సఫారీలు… రెండో టీ20లో విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. జెపి డుమిని, హెన్రిచ్‌ క్లాసెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. చాహల్‌ బౌలింగ్‌లో మిగతా వారు ఇబ్బంది పడ్డా. వీరిద్దరూ చక్కగా ఆడేస్తున్నారు. ఓపెనర్‌ జెజె స్మట్స్‌, డేవిడ్‌ మిల్లర్‌ ఆశించిన మేరకు రాణించ లేదు. మిల్లర్‌కు జట్టు అండగా నిలిచే అవకాశాలు న్నాయి. సఫారీ జట్టులో ఏ ఇద్దరు నిలిచినా 230 స్కోరైనా వారి ముందు బలాదూరే. అంత విధ్వంసకరంగా ఆడగలరు.

అందుకే నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా బౌలింగ్‌ చాలా కీలకంగా ఉండనుంది. ఇక బౌలింగ్‌ పరంగానూ ఆతిథ్య జట్టు బాగానే ఉంది. ఆతిథ్య జట్టుకు అచ్చిరాని కేప్‌టౌన్‌ పిచ్‌… నిర్ణయాత్మక మూడో టీ20 జరుగుతున్న కేప్‌టౌన్‌ పిచ్‌లో భారత్‌ తొలి సారి పొట్టి క్రికెట్‌ ఆడుతోంది. మ్యాచ్‌ జరుగుతున్నా కొద్దీ పిచ్‌ మందకొడిగా మారే అవకాశాలున్నాయి.

ఈ వికెట్‌ దక్షిణాఫ్రికాకు అచ్చిరాలేదు. ఇక్కడ 8 టీ20లు ఆడగా 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌, 2016లో ఇంగ్లాండ్‌పై ఒక మ్యాచ్‌ గెలిచింది. అయితే ప్రస్తుత తరుణంలో కొత్తవారితో ఒక జట్టుగా స్థిరపడ్డ దక్షిణాఫ్రికా ఏమైనా చేయగలదు.

జట్లు: భారత్‌: విరాట్‌ కోహ్లీ (సారథి), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, ఎంఎస్‌ ధోని, హార్థిక్‌ పాండ్యా,యజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ కుమార్‌, జయదేవ్‌ ఉన్కదత్‌, శార్ధూల్‌ ఠాకూర్‌.

దక్షిణాఫ్రికా: జెపి డుమిని (సారథి), బెహార్డిన్‌, జూనియర్‌ డాలా, రీజా హెండ్రిక్స్‌, క్రిస్టియాన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌, డేన్‌ ప్యాటర్‌సన్‌, అరోన్‌ ఫాంగిసో, ఫెలుక్‌వాయో, షంషి,జెజె స్మట్స్‌