రూపాయి పతనానికి అంతెక్కడ?

RUPEE IN DANGER
RUPEE IN DANGER

ముంబై: ఇటీవలకాలంలో దాదాపు నిరంతరం క్షీణిస్తూ ఉన్న రూపాయి మళ్లీ నేలచూపులు చూస్తోంది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంకు ఫోరెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ 37పైసలు అంటే 0.5శాతం పతనమై 71.92కు దిగజారింది. ఫలితంగా రూపాయి ఇంతకుముందెన్నడూ లేని విధంగా సరికొత్త కనిష్టాన్ని తాకింది. 72 మార్క్‌కు చేరువైంది. వెరసి గత ఐదేళ్లలోలేని విధంగా డాలరుతో మారకంలో రూపాయి గడచిన ఆరు రోజుల్లోనే అత్యధికంగా రూ.1.8 క్షీణించగా, గత మూడురోజుల్లోనే రూ.1.4పడిపోవడం విశేషం. గత కొద్దిరోజులుగా రోజుకో కొత్త కనిష్టానికి చేరుకుంటున్న రూపాయి బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో కాస్త కోలుకుంది. డాలరుతో మారకంలో మొదట 18 పైసలు అంటే 0.25శాతం పెరిగింది. కాగా, సోమవారం మరోసారి రూపాయి సరికొత్త కనిష్టానికి చేరింది. 37పైసలు పతనమై 71.58 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక కనిష్టం కాగా, వర్ధమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతుండటం రూపాయిన దెబ్బతీస్తున్నట్లు ఫోరెక్స్‌ నిపుణులు చెబుతున్నారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు మరోసారి బలపడుతోంది. 95.3కు చేరింది. ఫలితంగా ఇటీవల డాలరుతో మారకంలో పతనబాటలో సాగుతున్న వర్ధమాన దేశాల కరెన్సీలు మళ్లీ పతనమయ్యాయి. తాజాగా యూరో 0.32 శాతం బలహీనపడి 1.158ను తాకగా, కెనడియన్‌ డాలర్‌ 0.64 శాతం పతనమై 1.32 కు చేరింది. ఇది ఆరు వారాల కనిష్టం. దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్‌ 3.3శాతం పతనం కాగా, టర్కీ కరెన్సీ లీరా కూడా ఒక శాతం తిరోగమించింది. ఆగస్టులో తయారీ రంగం జోరందుకోవడంతో మరోపక్క యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ మూడు వారాల గరిష్టానికి చేరాయి. పదేళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ 2.89 శాతానికి చేరింది. గత వారం అర్జెంటీనా పెసో 12 శాతం పతనమవడం వల్ల 2018లో 54 శాతం క్షీణించడం ద్వారా సోమవారం మరో 3.2శాతం క్షీణించిన సంగతి విదితమే. ఇప్పటికే దివాళా అంచున చేరిన అర్జెంటీనా మరోసారి సమస్యల్లో చిక్కుకుంది. ప్రెసిడెంట్‌ మారిషియో మాక్రీ ఎగుమతులపై పన్నులు విధించడంతోపాటు, ప్రభుత్వ వ్యయాలలో భారీ కోతలు ప్రకటించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమతూకం చేసే ప్రయత్నంలో అత్యవసర చర్యలకు దిగినట్లు మాక్రీ ప్రకటించారు. దీంతో అర్జెంటీనా కరెన్సీ పెపో మరోసారి కుంగింది. టర్కిష్‌ కేంద్ర బ్యాంకు ఆదేశ కరెన్సీ లీరా పతనాన్ని అడ్డుకునేందుకు వడ్డీరేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ లీరా కూడా బలహీనపడుతుండటం గమనించదగ్గ అంశం. ఈ అంశాలు సైతం రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.