రిపబ్లిక్‌ వేడుకలకు ట్రంప్‌ రావడం లేదు

trump
trump

న్యూఢిల్లీ: 2019లో దేశ గణతంత్ర దినోత్సవ ఉత్సహాలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను భారత్‌ ఆహ్వానించింది. అయితే భారత ఆహ్వానాన్ని ట్రంప్‌ తిరస్కరించారు. భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా డొనాల్డ్‌ ట్రంప్‌ కు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని వైట్‌ హౌస్‌ వర్గాలు ఈ ఏడాది ఆగష్టులో స్పష్టం చేశాయి. అప్పుడే ఈ ఆహ్వానాన్ని తిరస్కరించి ఉంటే పెద్దగా చర్చ జరిగి ఉండక పోవచ్చు. కానీ ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు భారత ఆహ్వానాన్ని తిరస్కరించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. భారత్‌, ఇరాన్‌ ల మద్య సంబంధాలు, భారత్‌ రష్యాతో ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై అమెరికా కోపంగా ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్‌ భారత ఆహ్వానాన్ని తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌ పై ఆంక్షలు విధించిన అమెరికా ఆ దేశం నుంచి ఎలాంటి వాణిజ్య సంబంధాలు నెరపరాదని భారత్‌ కు సూచించింది. దీంతో అమెరికా భారత్‌ల మధ్య టెన్షన్‌ వాతవరణం నెలకొంది. భారత్‌ రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై కూడ అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయుధాలు కొనుగోలు చేయరాదని భారత్‌ కు సూచించింది. అయితే భారత రక్షణ వ్యవస్థలో అధిక శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలే ఉన్నాయి. దీనిపై భారత్‌, అమెరికా ల మధ్య చర్చలు జరిపిన తరువాత భారత్‌ పై ఆంక్షలు సడలించింది అగ్రరాజ్యం. ఇక ఇరాన్‌ నుంచి పలు దేశాలు అయిల్‌ దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేసేందుకు నవంబరు 4 న తుది గడువు విధించింది అమెరికా. కానీ అమెరికా ఆదేశాలను భారత్‌ బేఖాతరు చేస్తూ ఇరాన్‌ నుంచి అయిల్‌ దిగుమతిని కొనసాగిస్తోంది.