రికార్డుల ప‌రంప‌ర‌లో పుజారాను దాటేసిన స్మిత్‌

SMITH
SMITH

మెల్‌బోర్న్ః అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఆసీస్‌-భారత ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఒకరి రికార్డును మరొకరు బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ భారత క్రికెటర్‌ పుజారా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకీ అది ఏంటంటే.
2017 సంవత్సరంలో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో భారత క్రికెటర్‌ పుజారా(1,140) అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఇప్పటి వరకు అతని పేరు మీదే ఉంది. మరో రెండు రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పడనుంది. ఈ తరుణంలో ఆసీస్‌ సారథి స్మిత్‌.. పుజారా పరుగులను దాటేశాడు. దీంతో ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా స్మిత్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం స్మిత్‌ యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఆడుతోన్న సంగతి తెలిసిందే.
బాక్సింగ్‌ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఈ ఏడాదిలో 11 టెస్టుల్లో 20 ఇన్నింగ్స్‌ల ద్వారా స్మిత్‌ 1,304(11 మ్యాచులు, 20 ఇన్నింగ్స్‌లు) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. పుజారా 1,140(11 మ్యాచులు, 18 ఇన్నింగ్స్‌లు)తో రెండో స్థానంలో ఉన్నాడు. భారత పరుగులు యంత్రం విరాట్‌ కోహ్లీ 1,059తో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
క్యాలెండర్‌ ఇయర్‌లో స్మిత్‌ వెయ్యికి పైగా పరుగులు సాధించడం ఇది వరుసగా నాలుగోసారి. గతంలో మాథ్యూ హెడెన్‌ వరుసగా ఐదుసార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించాడు.