రాహుల్ లేదా ప్రియాంకను మెదక్ నుంచి పోటీ చేయాలని కోరతా

ఏకగ్రీవ ఎన్నికకు కేసీఆర్ సహకరించాలి
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలలో మెదక్ నుంచి పోటీ చేయాలని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కోరతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఒకవేళ రాహుల్, ప్రియాంక అంగీకరించిన పక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కేసీఆర్ బీజేపీని ఒప్పించాలని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ప్రియాంక రాక కోసం దేశం ఎదురు చూసిందనీ, నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ఉండటంతో ఆమెకు క్రేజ్ ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీలో రాజీవ్ గాంధీని దేశ ప్రజలు చూసుకుంటున్నారనీ, ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా అదనపు బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి రావడం కుటుంబ వారసత్వ రాజకీయాలకు నిదనర్శనమని బీజేపీ నేతలు చేసిన విమర్శను ప్రస్తావిస్తూ అది ఆ పార్టీ నేతల చేతగానితనాన్ని సూచిస్తుందన్నారు. కుటుంబ వారసత్వంగా ప్రభుత్వ పదవులు అనుభవిస్తేనే వారసత్వ రాజకీయాలు చేస్తున్నట్లనీ, అలా కాకుండా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.ప్రధాని మోడీకి కుటుంబం అంటూ ఏదీ లేదనీ అందువల్ల ఆయనకు కుటుంబ రాజకీయాల గురించి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ సమర్థతకు రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలలో విజయమే సాక్ష్యమనీ, సమర్థులకు బాధ్యతల అప్పగింతలో భాగంగానే ప్రియాంకకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించిందని అభిప్రాయపడ్డారు. ప్రియాంక రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ మంచి వ్యూహకర్త అనీ, అందుకే ప్రియాంకను సరైన సమయంలో పార్టీలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాహుల్ లేదా ప్రియాంక మెదక్ నుంచి పోటీ చేయాలని తాను ఏఐసిసికి లేఖ రాస్తానని చెప్పారు.ప్రియాంక అయినా, రాహుల్ అయినా మెదక్ నుంచి పోటీ చేస్తే ఏకగ్రీంగా గెలిపించాలని కోరారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ అన్ని పార్టీలను ఒక్కటి చేసిన విధంగానే తెలంగాణ ఇచ్చిన కుటుంబం మెదక్ నుంచి పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించేందుకు కృషి చేయాలనీ, టీఆర్ఎస్ పోటీ పెట్టవద్దనీ, అలాగే, బీజేపీని కూడా పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించేందుకు ఆ పార్టీ నేతలను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కకు పూర్తి మద్దతు ఇస్తామనీ, అయనను వ్యతిరేకిస్తే రాహుల్ గాంధీని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు. తామంతా భట్టిలో రాహుల్ గాంధీని చూస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా వచ్చే లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.