రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం

కేంద్ర రైల్వే శాఖతో ఎపి సర్కారు ఒప్పందం
ఎంఒయుపై సంతాకాలు చేసిన కేంద్రం, ఎపి అధికారులు
న్యూఢిల్లీ : కేంద్రంలోని ఎన్‌డిఏ సర్కారు దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించటానికి సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన విషయంలో రాష్ట్రాలు, కేంద్రం భాగస్వామ్య కంపెనీగా ఏర్పడి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయటం కేంద్రం లక్ష్యం. ఇందులో కేంద్రం వాటా 49శాతం, రాష్ట్రం వాటా 51శాతం ఉంటుంది. లాభనష్టాలు, పెట్టుబడులు కూడా ఇదే తరహాలో కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి. ఈతరహా ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోని 17 రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయటానికి ముందుకు వచ్చాయి. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు ఏకె శ్రీవాస్తవ, రైల్వే శాఖ ఉన్నతాధికారి దుడేజాల మధ్య రాతపూర్వకమైన అవగాహన ఒప్పందం కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు ఆధ్వర్యంలో జరిగింది. న్యూఢిల్లీలోని రైల్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు ఒప్పంద పత్రాలు ఇచ్చి, పుచ్చుకున్నారు. ఈ భాగస్వామ్య కంపెనీలు పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో నిర్వహిస్తారు.  భూసేకరణ, నిధుల సమీకరణ రెండింటిలోనూ ఇరువురి ప్రమేయం ఉంటుంది. అలాగే రాష్ట్రం తన వాటాలో అత్యధికంగా 28శాతం వరకు ఎవరికైనా స్టేక్‌ ఇచ్చుకునే అవకాశం కూడా కేంద్రం కల్పించింది. పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇందులో వాటాలు కొనుగోలు చేయవచ్చు. రైల్వేలకు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు కేంద్రం ఈతరహా ప్రయత్నం చేస్తున్నది.  రైల్వేల ఆధునీకరణ, కొత్త గేజ్‌ ఏర్పాటు, దేశంలో వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత రిమోట్‌ ఏరియాల్లో కూడా రైళ్లను నడపటం ప్రస్తుతం కేంద్రం  ముందున్న లక్ష్యం ఇందులో భాగంగానే ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పలు పనులు పూర్తి చేయటానికి రైల్వే శాఖకు రూ.3.5 లక్షల కోట్లు అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని కల్పించింది.