రాష్ట్రానికి కేజ్రీవాల్‌

KEJRIWAL
KEJRIWAL

116 స్థానాల్లో పోటీ తెలంగాణలో ప్రచారం
హైదరాబాద్‌: తెలంగాణలో జరుగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికిగాను త్వరలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించుతామని ఇప్పటికే ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి ప్రకటించారు. రాష్ట్రంలో 116 స్థానాల్లో పోటీకి దిగనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం భావించింది. అలాగే మహాకూటమిలో చేర్చుకునేందుకు మిత్రపక్షాలు ఆసక్తి చూపాయి. అయితే ఎవరితోనూ జతకలవబోమని తేల్చిచెప్పిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆదిశగా ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున పోటీలోకి దించేందుకు అభ్యర్థులను ప్రకటించే పనిలో ఆ పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. త్వరలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం కేజ్రీవాల్‌ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మరోపక్క దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ఇటీవలే ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్న విధంగా కాకుండా ఈ సారి తాము గెలుపొందే అవకాశాలు ఉన్న ప్రతీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులోభాగంగా మంగళవారం పంజాబ్‌ నుండి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది.