రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పతనం ప్రారంభమైంది..చంద్రబాబు
tdp-chandrababu-fires-on-ap-govt
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు బుధవారం అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పతనం ప్రారంభమైందని, తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నాంది అని అన్నారు. 20 నెలల వైఎస్ఆర్సిపి పాలనలో అన్నీ ఉల్లంఘనలేనని ఆయన ఆరోపించారు. జగన్ పార్టీ నేతలు రాజ్యాంగ వ్యవస్థలన్నీంటిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పెట్టుబడులను ధ్వంసం చేశారు. ప్రభుత్వ విద్వేషాల కారణంగా రైతులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారని చంద్రబాబు ఆరోపించారు.
వైఎస్ఆర్సిపి నేతల దుర్మార్గాలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. టిడిపి నాయకులను ఎంత హింసపెట్టినా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని అభినందించారు. ఎన్నికల్లో టిడిపికి 38.74 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. 94 శాతం పంచాయతీలను గెలిచామని వైఎస్ఆర్సిపి గాలిమాటలు చెబుతుందని ఎద్దేవా చేశారు. టిడిపి ప్రజల గుండెల్లో ఉందని, అరాచకాలు చేసేవారు ఎన్నికల ఫలితాలు చూసైనా మారాలని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని అచ్చెన్నాయుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఏది మాట్లాడినా పట్టించుకోరా.? అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.