రాష్ట్రంలో దీపావళికి అంద‌రికి నీళ్లు

CM KCR
CM KCR

భగీరథ పనుల్లో బాలారిష్టాలపై సిఎం కెసిఆర్‌ సమీక్ష
హైదరాబాద్‌: ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు,దీపావళి నాటికి అన్ని ఇళ్లకు స్వచ్చమైన మంచినీరు అందించేందుకు తుది ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిషన్‌ భగీరథ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్‌ భగీరథ పథకంలో ఇప్పటికే అత్యధిక భాగం పనులు పూర్తియ్యాయని, పూర్తయిన పనుల్లో బాలారిష్టాలను అధిగమించడంతో పాటు మిగిలిన కొద్దిపాటు పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సిఎం కోరారు. మిషన్‌ భగీరథపై బుధవారం ప్రగతి భవన్‌లో సిఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు,మిషన్‌ భగీరథ వైఎస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌కుమార్‌ ముఖ్యకార్యదర్శి శాంతకుమారి, కార్యదర్శి స్మిత సభర్వాల్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావు, మిషన్‌ భగీరథ సలహాదారులు జ్ఞానేశ్వర్‌, మనోహర్‌, సిఐ విజయ ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కనకయ్య,ఎమ్మెల్సీ సలీం తదితరులు పాల్గొన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఒక్కసారి శుద్ది చేసిన నీటిని సరఫరా చేసిన తర్వాత,ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని సిఎం అధికారులను కోరారు. పను లన్నీ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నిర్మించిన ఇన్‌టేక్‌వెల్స్‌,వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌, ఓహెచ్‌బిఆర్‌,డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు,విద్యుత్‌ సబ్‌స్టేషన్లంటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సిఎం ఆదేశించారు. పనుల్లో అనుకున్నంత వేగంలేని ప్రాంతాల్లో స్వయంగా మిషన్‌ భగీరథ వైఎస్‌ చైర్మన్‌, సెక్రటరీ,ఈఎన్సీ స్వయంగా పర్య టించాలని ఆదేశించారు.ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతి,ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ముఖ్య మంత్రి నేరుగా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు,అధికారులు, వర్క్‌ ఏజన్సీలతో సిఎం మాట్లాడి అప్రమత్తం చేశారు.పది జిల్లాల్లో పనులు వందకు వంద శాతం పూర్తవుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలని సిఎం చెప్పారు.